విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వం విద్యా వ్యవస్థకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ లతో కలిసి ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో విద్యార్థుల సంఖ్య, సౌకర్యాల కల్పన పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన పూర్తిస్థాయి సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు. పాఠశాలలలో ప్రహరీ గోడ, త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు ఇతర సదుపాయాలు కల్పించడంతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని తెలిపారు. లక్షెట్టిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ సంవత్సరం దాదాపు వేయి మంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలలో చేరుతున్నారని తెలిపారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో బెంచీలు, విద్యుత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరం మేరకు బోధనేతర సిబ్బంది ఉన్నారని తెలిపారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో విద్యార్థులకు సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్య బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఆసక్తిగా తరగతులకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు మంచి వాతావరణం కల్పించాలని, వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యా సంస్థలపై నమ్మకాన్ని కల్పించాలని తెలిపారు. విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనంలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, విద్యావ్యవస్థలో పటిష్టం చేస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం రైసింగ్ 2047 లో అన్ని రంగాలలో ముందుండాలని తెలిపారు. మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం జరిగిందని, ఉపాధ్యాయులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి కొరకు దాదాపు 100 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపట్టడం జరిగిందని, వార్షిక పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించాలని తెలిపారు . కాగితాలపై లెక్కలు కాకుండా క్షేత్రస్థాయిలో పురోగతి సాధించాలని తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ ఉపాధ్యాయుల కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నో నాణ్యత, అర్హత పరీక్షలను దాటుకొని ఉద్యోగం సాధిస్తారని, ఉపాధ్యాయులకు ఉన్న విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించి తీర్చిదిద్దాలని కోరారు.






