26 April, 2026 | 3:57 PM

బెడిసికొట్టిన దౌత్యం!

02-03-2025 12:00 AM

గత మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యాఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికి ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? అన్న అనుమానా లు కలుగుతున్నాయి. రష్యాతో యుద్ధాన్ని ఆపడానికి ఉక్రెయిన్‌లో విలువైన ఖనిజాలను తవ్వుకోవడానికి అమెరికాను అనుమతించే ఒప్పందంపై సంతకాలు చేయడానికి శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వాషింగ్టన్‌లో ట్రంప్‌తో భేటీ కావడంపై ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాయి. శుక్రవారం ఓవల్ హౌస్‌లో ఇరువురు నేతలు మధ్య జరిగిన సమావేశానికి అమెరికాతో పాటుగా ప్రపంచ మీడియాను కూడా అనుమతించారు.

భేటీ అనంతరం ఇరువురు నేతలు మీడియానుద్దేశించి మాట్లాడా లి కూడా. అయితే దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఇరువురు నేతల భేటీ అరగంట సేపు సుహృద్భావ వాతావరణంలోనే సాగింది. కానీ తాము ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమేనని, అయితే భవిష్యత్తులో రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్‌స్కీ ఒత్తిడి తేవడం ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్‌లకు ఆగ్రహం తెప్పించింది. ఇన్నాళ్లుగా సాయపడుతూ వచ్చిన దేశంతో మాట్లాడే పద్ధతి ఇది కాదని, ఇది అవమానకరంగా ఉందని ట్రంప్ ఖండించారు.

ఇలాగైతే లాభం లేదని తేల్చి చెప్పా రు. తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని, లేదంటే తాము తప్పుకొంటామని, అప్పుడు మీరొక్కరే పోరాడుకోవాలని తేల్చిచెప్పారు. ఇంతకు మించి మీకు మరోమార్గం లేదని ఖరాఖండిగా చెప్పారు.  మీరు డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేరని కూడా జెలెన్‌స్కీకి ట్రంప్ స్పష్టం చేశారు. లక్షల మంది ప్రాణా లతో జూదమాడుతున్నారని, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని తీవ్రస్వరంతో హెచ్చరించారు. చర్చను అర్ధాంతరంగా ముగించి వెళ్లి పోయారు. దీంతో ఈ సమావేశంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉక్రెయిన్ రా యబారి తలపట్టుకోవడం మీడియా సమావేశంలో స్పష్టంగా కనిపించింది.

ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య ఒప్పందం కుదురుతుందా, ఉక్రెయిన్‌లో శాంతి నెలకొంటుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. జెలెన్‌స్కీకి ఈ శాస్తి జరగాల్సిందేనని రష్యా వ్యాఖ్యానిస్తే, జెలెన్‌స్కీని అభినందిస్తూ యూరోపియన్ దేశాల నేతలు వరస పోస్టులు పెట్టడం గమనార్హం. అయితే ఈ గొడవ అంతా ముగిసిన తర్వాత జెలెన్‌స్కీ తనవైఖరిని మార్చుకోవడం విశేషం. తాము శాంతినే కోరుకొం టున్నామని, అందుకే తాను అమెరికా వచ్చానని ఆయన ఎక్స్‌లో ఉంచిన ఓ పోస్టులో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తమకు అత్యంత కీలకమని కూడా ఆయన అన్నారు.

తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు  విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతు తెలిపిన 30 యూరప్ దేశాల నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే మళ్లీ శాంతి చర్చలు ఎప్పుడు మొదలవుతాయనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ‘మళ్లీ రావాలనుకుంటే రండి’ అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. ట్రంప్ అగ్రరాజ్య అధినేతగా తన ఆధిపత్యాన్ని చాటాలనుకోవడం, రష్యానుంచి ఎలాంటి గ్యారంటీలు లేకుండా యుద్ధ విరమణకు అంగీకరించడం వల్ల తాము భారీగా నష్టపోతామన్న జెలెన్‌స్కీ భయాలు చర్చలకు పెద్ద అడ్డంకిగా మారాయి.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్, రష్యా మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు టర్కీ ప్రకటించడం విశేషం. అయితే సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా మధ్య మొదలైన తొలి విడత చర్చలు  కొనసాగుతాయా, లేదా కొత్తగా టర్కీ రంగంలోకి వస్తుందో చూడాలి. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం అంత సులభం కాదని ట్రంప్‌కు కూడా తెలుసు. ఇప్పటికే పూర్తిగా చితికిపోయిన ఉక్రెయిన్ తాను చెప్పినదానికల్లా తలూపేస్తుందని ఆయన భావించడమే పొరబాటు. పుతిన్‌నుంచి స్పష్టమైన గ్యారం టీలు లభించనిదే జెలెన్‌స్కీ ఒప్పందానికి సిద్ధంగా లేరనేది నిన్నటి భేటీతో తేలిపోయింది. మరి అందుకు పుతిన్‌ను ట్రంప్ ఒప్పిస్తారా అనేది చూడాలి.