నేడే తీన్మార్ మల్లన్న యాత్ర

17-09-2026 | 05:15am

గోల్కొండ కోట నుంచి వరంగల్‌లోని కాకతీయ కోట వరకు యాత్ర

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, హక్కులు, రాజ్యాధికారం అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) ‘బీసీ రాజ్యాధికార యాత్ర(BC Political Empowerment Yatra)’ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని గోల్కొండ కోట నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. గోల్కొండ కోట నుంచి ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘ పాదయాత్ర వరంగల్‌లోని కాకతీయ కోట(Kakatiya Fort) వరకు కొనసాగనుంది.

యాత్ర మార్గంలో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రజలను కలుస్తూ బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాలు తదితర అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నట్లు మల్లన్న తెలిపారు. బీసీ వర్గాలు రాజకీయంగా మరింత భాగస్వామ్యం కావాలనే అంశంపై ప్రజల్లో అవగాహన పెంచడం, వివిధ బీసీ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడం యాత్ర ముఖ్య ఉద్దేశాల్లో భాగమని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న చేపట్టనున్న బీసీ రాజ్యాధికార యాత్రకు పలు బీసీ, కుల సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.

ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ, జాతీయ బీసీ సేన పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించగా, మరికొన్ని కుల, సామాజిక సంఘాల ప్రతినిధులు కూడా యాత్రకు మద్దతు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్రలో భాగంగా తీన్మార్ మల్లన్న నేరుగా ప్రజలను కలవనున్నారు. ‘బీసీ రాజ్యాధికారమే లక్ష్యం’ అనే ప్రధాన నినాదంతో యాత్ర కొనసాగనుంది. బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. వివిధ బీసీ సంఘా లు, కుల సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొని సంఘీభావం తెలియజేయాలని మల్లన్న కోరారు. 

టీఆర్పీలో చేరికలు

ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం మండలంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు టీఆర్పీలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కొమిరిశెట్టి నరసింహులు, మండల అధ్యక్షుడు బూడిద శ్రీనాథ్‌గౌడ్ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరారు. మల్యాల గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు బిట్టు శ్రీనివాస్తో పాటు గణేష్, స్వామి, వెంకటేశం, ఆంజనేయులు, శ్రీనివాస్‌లతో పాటు మాంచినపల్లి, కేకే తండా, రామస్వామి తండాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు