3 August, 2026 | 2:13 AM

ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్‌గా తేజ్ వీర్

03-08-2026 01:28 AM

హైదరాబాద్, ఆగస్టు 2: అమరావతి తాడేపల్లిలోని సీతానగరంకు చెందిన మాస్టర్ చలాది తేజ్ వీర్ మార్షల్ ఆర్ట్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. 9 ఏళ్లకే ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో తేజ్ వీర్ తటా విభాగంలో మొదటి స్థానం సాధించాడు. 9 నుండి 12 ఏళ్ల లోపు 21 కిలోల విభాగంలో స్పారింగ్(ఫైట్) కేటగిరీలో రెండో స్థానంలో నిలిచాడు.

తండ్రి చలాది సతీష్ కూడా కిక్ బాక్సింగ్(వాకో)లో ఛాంపియన్. ఆయన 75 కేజీల విఙాగంలో మూడేళ్ల క్రితం రెండు సిల్వర్ మెడల్స్ సాధించారు. ప్రముఖ జర్నలిస్ట్ చలాది పూర్ణచంద్రరావు కుమారుడైన సతీష్ తన కొడుకు తేజ్ వీర్‌ను సైతం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రోత్సహిస్తున్నారు. తేజ్‌వీర్ ఐదేళ్ల నుండే అమరావతిలోని షావోలిన్ మాంక్స్ కుంగ్ ఫూ అకాడమీలో ఎం.నారాయణరావు దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న తేజ్‌వీర్ మార్చిలో జాతీయస్థాయి కటా ఈవెంట్ 25 కేజీల విభాగంలో మొదటి స్థానం సాధించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని తేజ్‌వీర్ చెబుతున్నాడు.