21 May, 2026 | 4:36 PM

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. కనీస వేతనాలు పెంపు!

21-05-2026 03:31 PM
  1. కార్మికులకు సీఎం శుభవార్త..
  2. కార్మికుల కనీస వేతనాలు పెంపు
  3. నాలుగు విభాగాలుగా కార్మికుల విభజన
  4. అన్‌స్కిల్డ్‌ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.16 వేలకు పెంపు..
  5. సెమీ స్కిల్డ్‌ కార్మికులకు రూ.13 వేల నుంచి రూ.15 వేలకు పెంపు..
  6. స్కిల్డ్‌ కార్మికులకు రూ.17 వేల నుంచి రూ.18 వేలు పెంచుతూ నిర్ణయం
  7. జూన్ 1 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి రానున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం(Telangana government) కార్మికులకు  శుభవార్త చెప్పింది. బీఆర్ఎస్ హయాంలో కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కనీస వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. కార్మికులను నాలుగు రకాలుగా విభజించామని ముఖ్యమంత్రి వివరించారు.

కార్మికులను అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ గా విభజించామని తెలిపారు. కార్మికుల వేతనాలు నిర్ణయించేందుకు జోన్లను మూడు జోన్లుగా నిర్ణయించామని వెల్లడించారు. జోన్-1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి. జోన్ -2 కింద మున్సిపాల్టీలు ఉంటాయి. జోన్ -3 కింద గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి.  జోన్-1లో అన్ స్కిల్డ్ కార్మికుల వేతనం 12,750 ఉంటే.. రూ. 16 వేలకు పెంచాం, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ. 13,592 ఉంటే రూ. 17 వేలకు పెంచాం, స్కిల్డ్ కార్మికులకు రూ. 13,772 ఉంటే రూ. 18,500, హైస్కిల్డ్ కార్మికులకు రూ. 14,607 ఉంటే  రూ.20వేలకు పెంచామన్నారు. పెంచిన వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఏఐ వచ్చినా బ్లూకాలర్ ఉద్యోగాలకు ముప్పు ఉండదు: రేవంత్  రెడ్డి

ఏఐ వచ్చినా బ్లాకాలర్ ఉద్యోగాలకు ముప్పు ఉండదని సీఎం స్పష్టం చేశారు. నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగాలకు ముప్పు ఉండదన్నారు. ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించలేని చదువులు వ్యర్థం అన్నారు. నైపుణ్యాలు ఉన్నావారు కావాలని విదేశాలు మిమ్మల్ని సంప్రదిస్తున్నాయని తెలిపారు. నైపుణ్యాలు పెంచుకునేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలిపారు. నైపుణ్యాలు పెంచుకుంటే విదేశాల్లో రూ. 2 లక్షల వరకు వేతనం ఉంటుందని సూచించారు. నైపుణ్యాలు పెంచేందుకు ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ. 2 వేలు ఇస్తున్నామని చెప్పారు.