06-02-2026 12:00:00 AM
నేడు వట్టికోట ఆళ్వారుస్వామి వర్ధంతి :
తెలంగాణ నవలా సాహిత్యం.. అనగానే గుర్తుకు వచ్చే మొదటి పేరు వట్టికోట ఆళ్వారుస్వామి. ‘అబద్ధాసురుని పాలిట తల్వార్ ఆళ్వార్’ అంటూ ఆళ్వారు స్వామిని కాళోజీ అభివర్ణించారు. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ సమీపంలోని మాదవరం అనే గ్రామంలో 1915 నవంబర్ 1న నిరుపేద వైష్ణవ బ్రాహ్మణ దంపతులు సింహాద్రమ్మ, రామచంద్రాచార్యులకు ఆళ్వారుస్వామి జన్మించారు. నిరుపేద కుటుంబం, దుర్భర దారిద్య్రంతో వట్టికోటకు చదువు అబ్బలేదు. దీంతో బడి మానేసి హెటల్‌లో సర్వర్‌గా పని చేశారు.
ఆ తర్వాత కందిబండ గ్రామానికి చెందిన నారపరాజు రాఘవరావు ఇంటికి ఆళ్వారుస్వామి తన మకాం మార్చారు. నారపరాజు సోదరులు తమ తండ్రి రాఘవరావు జ్ఞాపకార్థం ‘సీతారామ గ్రంథాలయాన్ని’ నెలకొల్పారు. ఆ గ్రంథాలయంలోనే వట్టికోట ఆళ్వారుస్వామి వేల పుస్తకాలు, పత్రికలు చదివి లోకజ్ఞానం సంపాదించుకున్నారు. ఇంగ్లీష్, ఉర్దూ భాషలను నేర్చుకొని సాహిత్యవేత్తగా ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు. 1933 ప్రాంతంలో హైదరాబాదుకు వచ్చిన ఆళ్వారు స్వామికి కోదాటి నారాయణరావు చొరవతో సురవరం ప్రతాపరెడ్డికి చెందిన ‘గోలకొండ పత్రిక’లో ప్రూఫ్ రీడర్‌గా పనిచేశారు.
1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమ ప్రేరణతో సికింద్రాబాద్‌లో జరిగిన సత్యాగ్రహంలో కాంగ్రెస్‌వాదిగా పా ల్గొన్న ఆళ్వారుస్వామిని నిజాం ప్రభుత్వం అరెస్టు చేసింది. నిజామాబాద్ జైలులో దాశరథి కృష్ణమాచార్యతో పరిచ యం వట్టికోట జీవితాన్ని మార్చేసింది. దాశరధి పద్యాలను వట్టికోట బొగ్గుతో గోడలపై రాసి అధికారుల చేతిలో దెబ్బలు తిన్నాడు. ‘విజ్ఞానానికి విలువ కట్టని సమాజం వృద్ధి చెందదు, వికసించదు’ అని బలంగా నమ్మి హైదరాబా దులో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించారు.
సురవరం రాసిన హైం దవ ధర్మాలు, ప్రాథమిక సత్యాలు, ప్రజాకవి కాళోజీ రచించిన ‘నా గొడవ’ మొట్టమొదటగా దేశోద్ధారక నుంచే ప్రచురింపజేశారు. తెలంగాణ ప్రముఖ రచయితలు రచించిన 35 పుస్తకాలు ఈ దేశోద్ధారక గ్రం థమాల నుంచి ప్రచురించబడ్డాయి. ఊరూరా తిరుగుతూ కవితలు, రచనలు సేకరిస్తూ గ్రంథాలను పంచుతూ ప్రజా చైతన్యానికి బాటలు వేశారు. కడివెండిలో పోలీసుల కాల్పుల్లో దొడ్డి కొమురయ్య మరణంపై ఆవేదన చెందిన ఆళ్వారుస్వామి కాల్పులకు సంబంధించి పద్మజా నాయుడుతో కలిసి నిజనిర్ధారణ నిర్వహించిన మొదటి పౌరహక్కుల నాయకుడు.
నాటి తెలంగాణ సామాజిక స్థితిగతులను తెలియపరుస్తూ రాసిన తెలంగాణ మొట్టమొదటి నవల ‘ప్రజల మనిషి’. జైల్లో ఖైదీల స్థితిగతులను సమూలంగా తెలియపరు స్తూ ‘జైలు లోపల’ అనే మరో నవలను రాశారు. 1951లో గుమస్తా పత్రికను స్థాపించారు. గుమస్తా సంఘం నాయకునిగా గుమస్తాల సమస్యలపై పోరాటాలు చేసి హక్కులు సాధించడంలో సఫలీకృతుడయ్యారు. ‘ధర్మరాజు’ అనే కలం పేరుతో ఎన్నో కథలు, కథానికలు రాశారు.
తెలంగాణ రాజకీయ సామాజిక స్థితిగతులను తెలియపరుస్తూ రాసిన అసంపూర్తి నవల‘ గంగు’. 1961 ఫిబ్రవరి 6న డిఫ్తీరియా వ్యాధితో బాధపడుతూ ఆళ్వారుస్వామి కన్నుమూశారు. తనతో జైలు జీవితాన్ని గడిపిన వట్టికోటకు దాశరథి తన ‘అగ్నిదాత’ కావ్యాన్ని అంకితమిచ్చారు. ఉద్యమమే ఊపిరిగా గ్రంథాల సుగంధాలను ఊరూరా వ్యాపింపజేసి ప్రజా చైతన్యాన్ని పెంపొందించి ‘ప్రజల మ నిషి’ అనిపించుకున్న ఆళ్వారుస్వామి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.
ఆచార్య ఎస్వీ సత్యనారాయణ
(తెలంగాణ తేజో మూర్తులు పుస్తకం సౌజన్యంతో)