06-02-2026 12:00:00 AM
ఈశాన్యంలో ప్రధాన రాష్ట్రమైన మణిపూర్‌లో ఏడాది తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పాటు కావడం శుభపరిణామం. బీజేపీ నేత, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గతేడాది మణిపూర్‌లో ప్రధాన తెగలైన కుకీ, మైతీ మధ్య హింస చెలరేగడంతో కేంద్రం నాటి ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. మైతీ వర్గానికి షెడ్యూల్ తెగ (ఎస్టీ) హోదా కల్పించాలనే డిమాండ్‌ను కుకీలు, ఇతర గిరిజన తెగలు వ్యతిరేకిస్తూ వచ్చాయి.
అదే సమయంలో కుకీ తెగలకు చెందిన ప్రాంతాలను ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్‌లుగా ప్రకటించడం, అక్రమ ఆక్రమణల పేరుతో వారిని ఖాళీ చేయించడంతో వివాదం తలెత్తింది. ఈ నేప థ్యంలోనే 2023 మే నెలలో మైతీ, కుకీ, ఇతర తెగలకు మధ్య జరిగిన ఘర్షణ హింసాకాండకు దారి తీసింది. అప్పటినుంచి జరిగిన ఘర్షణల్లో వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, అత్యాచారాలు, వలసలతో మణిపూర్ చిన్నాభిన్నమైంది. కుకీ తెగకు చెందిన మహిళలను నగ్నంగా ఊరే గించిన వీడియోలు సంచలనం సృష్టించాయి.
దీంతో కొంతకాలం మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాల్సి వచ్చింది. తరచూ హింసాత్మక ఘట నలు, పేలుళ్లు, నిరసనలతో మణిపూర్ అట్టుడికిపోయేది. అగ్నికి వాయువు తోడైనట్టు మణిపూర్ రెండేళ్ల పాటు అగ్నిగుండంలా మారడంలో మాజీ ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. మైతీ తెగకు చెందిన బిరేన్ పక్షపాత ధోరణితో ఇతర తెగల ఊచకోతను సమర్థించి అక్కడి ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.
బిరేన్‌ను సీఎం పీఠం నుంచి తొలగించడానికి ఢిల్లీ పెద్దలు సిద్ధమైనప్పటికీ మైతీ తెగ తిరుగుబాటు చేయడం ఆయనకు కలిసొచ్చింది. కానీ పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్రం చేజారిపోతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం బిరేన్ స్థానంలో మరొకరిని కూర్చొబెట్టడానికి బదులు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ఏడాది పాటు శాంతి పునరుద్ధరణ కోసం మైతీ, కుకీ తెగలతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపింది.
మణిపూర్‌లో శాంతిస్థాపనే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచు పర్యటించి అక్కడి వర్గాలతో చర్చించి పరిస్థితిని మెరుగుపరిచారు. మణిపూర్‌లో అశాంతికి మరో కారణం పొరుగు దేశం మయన్మార్. మయన్మార్‌కు చెందిన తీవ్రవాదులు సరిహద్దులు దాటి మణిపూర్ చేరుకుని కుకీ, మైతీ, ఇతర తెగలను రెచ్చగొట్టి అశాంతికి కారకులయ్యారు.మణిపూర్ ప్రకృతి రమణీయత, సహజ సంపదకు ఆవాలంగా ఉంది.
ఇక్కడి సంపదను దోచుకునిపోవడానికి బంగ్లాదేశ్, చైనా ఇప్పటికీ ప్రయత్నిస్తూ వచ్చాయి. దీంతో మణిపూర్‌లో రాజకీయాలను పక్కనబెట్టి, తెగల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. మణిపూర్‌లో మార్చి 13 నాటికి రాష్ట్రపతి పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఈలోగా అక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కేంద్రం తీసుకున్న చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి.
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఖేమ్‌చంద్ సింగ్‌కు పాలనానుభవం ఉంది. రాష్ర్టంలోని మైతీ, కుకీ, నాగా తెగలతో సన్నిహిత సంబంధాలుండడమే గాక అక్కడి పరిస్థితులు, వివాదాలపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఖేమ్‌చంద్ హయాంలోనైనా రాష్ట్రంలో పాలన సాఫీగా సాగాలని కోరుకుందాం.