దమ్మపేటలో అభివృద్ధి జోరు
దమ్మపేట, సెప్టెంబర్ (విజయ క్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) సోమవారం దమ్మపేట మండలంలో విస్తృతంగా పర్యటించి సుమారు రూ.84 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొండివర్రె గ్రామంలో హలో శుభోదయం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం జగ్గారంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి, రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన చేసి, అనంతరం రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు కొడిసెలగూడెంలో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనం, నాయుడుపేట పంచాయతీ తటిసుబ్బన్నగూడెం గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి: బోధనపై కలెక్టర్ ఫోకస్
పట్వారిగూడెంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మందలపల్లి లోని తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల నందు నిర్వహించిన అశ్వారావుపేట జోనల్ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.