21 April, 2026 | 2:31 AM

నిరుపేదలకు సొంతింటికల నెరవేర్చడం ప్రభుత్వ ధ్యేయం

21-04-2026 12:56 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్ మండలంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వెంకటంపల్లి, మర్రిపల్లి గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేసి నూతన వస్త్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంపు వంటి పలు సంక్షేమ పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని తెలిపారు.

ప్రతి పేద కుటుంబానికి స్వంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, ఇల్లు నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. గృహప్రవేశం సందర్భంగా స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అభినందనలు తెలియజేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.అలాగే రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఒకే విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసినట్లు తెలిపారు. రైతులకు సౌకర్యవంతంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. త్వరలో కాటారం సభలో మరిన్ని నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.