పరాభవం మనకు కాదు..
శత్రువులు, దేశద్రోహులకు!
- మనకన్నీ శుభఫలితాలే
- ప్రపంచంలోని అనేక దేశాల్లో యుద్ధం, శాంతిభద్రత సమస్య
- భారత్ మాత్రం అభివృద్ధిలో ముందుకు
- తీపి, చేదును సమిష్టిగా ఎదుర్కోవాలి
- ఉగాది వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): పరాభవం మనకు, మన దేశానికి కాదని, అది మన శత్రువులు, దేశద్రోహులకు మాత్రమేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. భారత్ ఎంతో పుణ్యభూమి అని, పవిత్ర దేశమని, ఈ పరాభవ నామ సంవత్సరం మనకు శుభఫలితాలనే అందించబోతుందని ఆకాంక్షించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘పంచాంగ శ్రవణం’ కార్యాక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సంవత్సరం గురించి పండితులు వివరించిన ప్రకారం, దేశానికి మంచి భవిష్యత్తు ఉం డబోతోందని, మంచి వర్షాలు కురిసి, పంట లు పుష్కలంగా పండుతాయని చెప్పారు. ప్రజలు సమస్యలు లేకుండా సుఖఃసంతోషాలతో జీవించబోతున్నారని, ఏవైనా సమస్య లు ఎదురైనా, వాటిని అధిగమించే శక్తి మ నకు ఉందని పేర్కొన్నారు.
మన దేశంలోని 140 కోట్ల ప్రజలు ఐక్యంగా నిలబడి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఏ సమస్యనైనా విజయవంతంగా ఎదుర్కొనే విశ్వాసం కలిగి ఉన్నారని వివరించారు. ఉగాది సందర్భంగా మనం తీసుకునే పచ్చడిలో తీపి, చేదు, పులుపు వంటి శడ్రు రుచులు ఉంటాయని, ఇది మన జీవితానికి ప్రతీకన్నారు. జీవితంలో కూడా సుఖాలు, దుఖాలు, సమస్యలు, ఆనందాలు అన్నీ కలగలిసే ఉంటాయని, వాటిని ఐక్యతతో, సహ నంతో ఎదుర్కోవడమే ఉగాది సందేశమని వెల్లడించారు.
ఈరోజు ప్రపంచంలోని అనేక దేశాలు యుద్ధాలు, ఆర్థిక సమస్యలు, శాంతిభద్రతల సమస్యలతో ఇబ్బందిపడుతున్నా యని, కానీ మన దేశం మాత్రం సమర్థవంతమైన నాయకత్వంతో, అభివృద్ధి దిశగా నిరంతరం ముందుకు సాగుతోందని, ఇది మనకు గర్వకారణమని తెలిపారు.
ఈ కొత్త సంవత్సరంలో భారతదేశానికి అభివృద్ధి, శాంతి, సుభిక్షం కలగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దామని కోరారు. దేశ ప్రజలందరికీ భగవంతుడు అండగా ఉండాలని, ఈ ఏడాది ప్రధాని మోదీకి అన్నీ విజ యాలు, శుభాలు కలిగించాలని కోరుకుం టూ ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.




