7 September, 2026 | 5:17 AM

అక్షరమే ఓ నిప్పు బావుటా

07-09-2026 | 04:00am

సమాజాన్ని ప్రభావితం చేసిన ప్రబలమైన కవిత్వాన్ని రాసిన కవి కాళోజీ(Poet Kaloji). తాడిత, పీడిత, ప్రజల పక్షపాతిగా నిఖ్సాన కవిత్వాన్ని నిగ్గుటద్దంలా రాసిన ప్రజాకవిగా అనితర సాధ్యమైన ప్రయాణాన్ని సాగించిన సాహితీమూర్తి ఆవేదన, ఆలోచన, చేతనలు ఆయ న కవిత్వంలో ప్రధానమైన అంశాలుగా కన్పిస్తాయి. కాళో జీ సిరా ఒలికిన ప్రతి అక్షరం కోట్లాది ప్రజల హృదయాలలో కదలికగా మారింది. ప్రతి అక్షరాన్ని నిప్పుబావుటాగా ఎగరేసిన క్రాంత దర్శి కాళోజీ.

కాళోజీ అనేక ప్రజా ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ప్రతి అన్యాయాన్ని నిలే సి ప్రశ్నించారు. ఆత్మ బలంతో నిజాం రాజు ను ఎదిరించడమే కాక రజాకార్లకు కూడా ఎదురొడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరుబాట పట్టారు. తనను తాను వదిలేసుకుని ఇతరుల బాగు కోసం పరితపించే పోరాడే సామాజిక స్పృహ, నిరంతర తపన కాళోజీలో రక్తగతమైంది.

అన్నార్తులు, అనాథలు, పీడిత, తాడిత ప్రజల పక్షాన నిలిచిన కవి కాళోజీ. మాటలలో, చేతలలో ప్రవర్తనలో, వేష భాషలలో, ఆలోచనలో, ఆర్తిలో, ఆవేదన, సంవేదనల లో ప్రజలనే తన లక్ష్యంగా భావించిన మహాకవి కాళోజీ. ప్రజాకవిగా పేరొందిన కాళోజీ గొప్ప దార్శనికులు. ‘తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖ ద్వారం కాళోజీ’ అని ఆయ న గురించి మహాకవి దాశరథి రాశారు. తెలంగాణ తనం నిండుగా కనిపించిన కవి కాళోజీ. కాలాలు మారినా ఉద్యమ పథ నిర్దేశం చేసే చిరకాల కవిత్వాన్ని అందించి వెళ్లారు కాళోజీ.

సమాజ గొడవను తన గొడవగా చేసుకుని ‘నా గొడవ’ పేరుతో అనేక కవితలు రాసి ఎనమిది సంపుటాలుగా కాళోజీ ప్రచురించారు. అంతర్జాతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, ప్రాంతీయ దృక్పథం ఆయన కవత్వంలోని ప్రత్యేకతలు. కత్తిగట్టి తన జీవి తాంతం పోరాడిన కాళోజీ రాజకీయాలు, ప్రజా ఉద్యమాలతో మమేకమై ఆలోచనాత్మక కవిత్వాన్ని అందించారు.

‘నా గొడవ’ లో సమాజాన్ని ఎక్స్ రే కళ్లతో చూసి అనేక కోణాలను ఆవిష్కరించారు. నిజాలను కవి త్వం సాక్షిగా బట్టబయలు చేశారు. ఎవరేమనుకున్నా వాస్తవాలను విడమర్చి చెప్పే తత్వం‘నా గొడవ’లో ప్రతిచోటా వ్యక్తమైంది.

‘ఓటేసెటప్పుడు వుండాలి బుద్ధి

ఓటు బోయిన కుండ నెంచుకోవద్దు’ అన్న మాటల్లో కాళోజీ ప్రశ్నలతో కూడిన వాస్తవాల ఆవిష్కరణ కన్పిస్తుంది. కాళోజీ ప్రతి కవిత్వ పంక్తి ఆచరణ యోగ్యం, సదా అనుసరణీయం. సామాన్య ప్రజానీకానికి అంత దగ్గరగా కవిత్వాన్ని తీసుకెళ్లిన పరిస్థితి ‘నా గొడవ’లో స్పష్టంగా కన్పిస్తుంది. కవిత్వ చరణాలు చదువుతుంటే సమాజ మానవ ప్రవృత్తులు అర్థమవుతాయి. ప్రతి ఒక్కరూ అన్వయించుకొని ఆలోచించాల్సిన దిశానిర్దేశాన్ని ‘నా గొడవ’ అందిస్తుంది. ‘పుటక నీది, చావు నీది/బతుకంతా దేశానిది’ అని ఆయ న రాసిన వాక్యాలు ఆలోచనాత్మకమైనవి.      

కాళోజీ అందరికీ తెలుసు. కాళోజీకి కూడా అందరూ తెలుసు.తిననోచని మాట్లాడనోచని నోరు, కష్టం చేసి, తిన నోచని చేతులు, సేవ చేసి ప్రేమించ నోచని శరీరం, మనిషి స్పర్శ నోచని మనిషి కాళోజీ స్వభావానికి అసలే సరిపడవు. అడుగడుగునా నా గొడవలో కాళోజీ నిష్కర్శ విమర్శాతత్వం దర్శనమిస్తుంది.

రచనలో భాషను ఉపయోగించే విషయంలో కాళోజీకి కచ్చితమైన అభిప్రాయా లు ఉన్నాయని ‘నా గొడవ’లోని ఎన్నో కవి త్వ పంక్తులు స్పష్టం చేస్తాయి. పలుకుబడుల వ్యావహారిక భాషలోనే కాళోజీ రచన కొనసాగింది. కాళోజీ ఎప్పుడూ జీవ భాష వైపే మొగ్గుచూపి రచనను పరిపుష్టవంతం చేశారు.

‘ప్రాంతేతరులే దోపిడీ చేస్తే పొలిమేర దాకా తరుముతాం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతో పాతర వేస్తాం’ అంటూ ఆగ్రహించి తెలంగాణ అస్తిత్వాన్నిచాటిన కవి కాళోజీ. ‘వీర తెలంగాణ నాది వేరు తెలంగా ణ నాది/ వేరై కూడా తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికీ’ అని ధైర్యాన్ని నూరిపో శారు కాళోజీ. ‘నా గొడవ’లో స్వచ్ఛత సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన ఎన్నో రీతుల్లో వ్యక్తమైంది. ద్వంద ప్రవృత్తులు, అన్యాయ రీతులపై ఖండనను స్పష్టంగా కనబరిచారు కాళోజీ. కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ లౌక్యాలు, వ్యంగ్యాస్త్రాలు ఉదాహరిస్తూనే కాళోజీ ‘నా గొడవ’లో సాహిత్య విలువలకు స్థాపన చేశారు.

కాళోజీ మనుషులను, సమాజాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్న కవిగా ‘నా గొడవ’లో కన్పిస్తారు. ప్రహ్లాదుడు అన్యాయాన్ని ఎదిరించాడని, ఎదిరించినోడే తన కు ఆరాధ్యుడని కాళోజీ నా గొడవలో పలుమార్లు ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉంటుందని భావంచారు. మెడలో బోర్డు వేసుకుని తిరిగి ఓటు హక్కు ప్రజాస్వామికమైందని ప్రకటించిన కాళోజీ నిర్భీతి కలిగిన కవి.

‘నా గొడవ’లో అంతా నిర్భయత్వమే. నిజానికి నిర్భయంగా మాట్లాడడమే కవిగా ఆయన నైజం. ఒకచోట తొక్కి నొక్కబడ్డప్పు డు ప్రత్యేక రాజ్యం పాలు కోరడం తప్పదు అంటారు కాళోజీ. ‘కాలంబు రాగానె కాటేసి తీరాలె... కసి ఆరిపోకుండా బుస కొట్టుచుండాలె’ అని తీవ్ర స్వరం వినిపించారు. నా గొడవలోని కవిత్వాన్ని తరతరాలకు మార్గదర్శనం చేసే దారి దీపంగా కాళోజీ మలిచా రు. నిఖ్సాన ప్రజల కవిత్వానికి కొలమాన సదృశ్యమే కాళోజీ నా గొడవ.


మరిన్ని వార్తలు