23 May, 2026 | 3:19 AM

రోడ్డు అధ్వాన్నం.. ప్రయాణం ప్రాణసంకటం!

23-05-2026 01:40 AM
  1. గుంతలమయంగా గుండెబోయినగూడెం రోడ్డు
  2. ప్రాణసంకటంగా మారిన ప్రయాణం
  3. నూతన రోడ్డు వేయాలని వేడుకోలు

పాలకవీడు, మే 22 : మండల పరిధిలో గుండెబోయిన గూడెం నర్లెంగులగూడెం రోడ్డు అధ్వానంగా మారీ ప్రయాణం చేసేందుకు వాహనదారులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు విస్తరించకపోవ డంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజుపై కంకరతేలి, గుంతలు పడి అధ్వానంగా మారిన రోడ్లకు కనీసం మరమ్మతులు చేసేవారు కరువయ్యారు. ఈ రోడ్డు మీదుగానే ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వెళ్తున్నా పట్టించుకోవ డం లేదని ప్రజలు వాపోతున్నారు.

 ప్రాణసంకటంగా ప్రయాణం : 

గుండెబోయిన గూడెం నర్లెంగులగూడెం గ్రామాలకు వెళ్లే రోడ్లపై ప్రయాణం ప్రాణాల మీదికి తెస్తున్నదని వాహనదారులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా కనీస నిర్వహణ లేక, మరమ్మత్తులకు నోచుకోకపోవడంతో రోడ్లు ప్రమాదకరంగా మారాయి అంటున్నారు. పగటి పూట రాకపోకలు సాగించాలంటే అష్టకష్టాలు పడుతున్న వాహన చోదకులకు, రాత్రి సమయంలో మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి పరిస్థితి నెలకొంటుంది. ఇక ఈ రోడ్లమీద వెళ్లే ఆటోలు, ఇతర వాహనాలు అతితక్కవ సమయంలోనే బాగా దెబ్బతింటుండటంతో వాళ్లకు వచ్చే ఆదాయంలో ఎక్కువ మొత్తంలో మరమ్మత్తులకు కేటాయించాల్సి వస్తుందని వాహనాల యజమానులు చెబుతున్నారు.

ఈ రోడ్డు పరిధిలోని గ్రామాల రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు తరలించాలన్నా, సాగుకు అవసరమైన ఎరువులు వంటివి తేవాలన్నా.. అవస్థలు తప్పడం లేదని చెబుతున్నారు. అలాగే రోడ్డు పై ఏదైనా వాహనం వెళ్తుంటే వెలువడే దుమ్ము, ధూళితో వెనుక వచ్చే ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కావున ఈ రోడ్డుపై ప్రయాణం చేసేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను అర్థం. చేసుకుని పాలకులు, అధికారులు స్పందించి వెంటనే నూతన రోడ్డు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

కొత్త రోడ్డు వేయాలి..

దశబ్దకాలంగా కంకర తేలిన రోడ్డుపై వెళ్లాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో వెళ్లాల్సి వస్తుంది. గుం తలు బాగా ఉండడంతో ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోడ్డు పై ప్రయాణం చేయాలంటే నరకయాతన పడుతున్నాం. కావున అధికారులు నూతన రోడ్డు వేయించి ఇబ్బందులు తొలగించాలి. 

వెంకట్ నాయుడు ,గుండెబోయిన గూడెం