27 July, 2026 | 9:26 PM

రహదారుల నిర్మాణంలో అడ్డంకిగా అటవీశాఖ

27-07-2026 08:22 PM

- కాంగ్రెస్ నాయకులు

చెన్నూర్,(విజయక్రాంతి): అటవీ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న రహదారుల నిర్మాణాలకు అటవీశాఖ అడ్డంకిగా మారిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. సోమవారం ప్రెస్ క్లబ్‌లో సీనియర్ నాయకులు, కోటపెల్లి మాజీ జడ్పీటీసీ పోటు రాంరెడ్డి విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏండ్లు గడిచినా మారుమూల అటవీ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సరైన సంబంధాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాత అటవీ సంరక్షణ చట్టాల కారణంగా అనుమతులు లభించక అనేక గ్రామీణ రహదారి ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయన్నారు. తరతరాలుగా వినియోగంలో ఉన్న బండిదారుల అభివృద్ధికి సైతం విధానపరమైన అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్ తివారీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ రాజమల్ల గౌడ్, తదితర కాంగ్రెస్  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.