అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు చేరాలి
- నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- మోటకొండూర్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభ
ఆలేరు, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూర్ మండలంలో గురు వారం ప్రజాపాలన ప్రగతిప్రణాళిక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా చేరేలా అధికారులు బాధ్యతగా పని చేయాలని సూచించారు.
ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో జిల్లా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మండల అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్న కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. మండల స్థాయిలోనే ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలుస్తుందని అధికారులు, ప్రజలు అభిప్రాయపడ్డారు.






