ఆ పంచాయతీలో షాడో సర్పంచ్ హవా
పినపాక సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): పినపాక మండలం(Pinapaka Mandal) తోగ్గూడెం గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ వెనుక ఉండి నడిపిస్తున్న ఓ 'షాడో సర్పంచ్' పెత్తనం వల్ల సర్పంచ్ కేవలం నామమాత్రంగా మారి, వెనుకున్న వ్యక్తి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటుండటంతో పంచాయతీ పాలన వివాదాస్పదంగా మారింది.
ఈ ఆధిపత్యం వల్ల తలెత్తిన ప్రధాన సమస్యలు:
గ్రామ సమాఖ్య భవన నిర్మాణం నిలిపివేత:
గోపాలరావుపేటలో గ్రామ సమాఖ్య భవనం కోసం మండల అధికారులు, గిర్దావర్-1 కలసి స్థలాన్ని పరిశీలించి అనుకూలమైన పంచనామా నివేదిక ఇచ్చి 9 నెలలు గడుస్తోంది. అయినప్పటికీ సర్పంచ్ పంచాయతీ తీర్మానం ఇవ్వకపోవడంతో నిర్మాణం ఆగిపోయింది. దీనివల్ల మహిళా సంఘాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.
ఓటీపీ ఇవ్వకుండా బిల్లుల అడ్డుకట్ట:
పంచాయతీలో పూర్తయిన అభివృద్ధి పనులకు నోట్‌ఫైల్ ఆమోదం పొంది, ఆన్లైన్ చెక్కులు సిద్ధమయ్యాయి. ఉపసర్పంచ్ తన డిజిటల్ ఓటీపీ ఇచ్చినా, సర్పంచ్ మాత్రం గడిచిన 20 రోజులుగా తన ఓటీపీ ఇవ్వడానికి నిరాకరిస్తూ చెల్లింపులను అడ్డుకుంటున్నారు.
'ప్రజావాణి'లో బాధితుడి వేడుకోలు:
పంచాయతీలో పెయింటింగ్ పనులు చేసిన రాంబాబు అనే పేద పెయింటర్‌కు బిల్లులు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. పంచాయతీ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన 'ప్రజావాణి'లో అధికారులను ఆశ్రయించి కన్నీటిపర్యంతమయ్యాడు. స్పందించిన అధికారులు బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, షాడో సర్పంచ్ హుకూంలకు తలొగ్గి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న సర్పంచ్ విచారించి నిలిచిపోయిన నిధులను విడుదల చేసి తోగ్గూడెం అభివృద్ధికి బాటలు వేయాలని స్థానికులు కోరుతున్నారు.