స్వాతి ఉదంతం
ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్, రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ దాడి ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో సమావేశం కోసం తాను ఆయన నివాసానికి వెళ్ల్లినప్పుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేసి దారుణంగా కొట్టారని, తీవ్ర పదజాలంతో దూషించారనేది స్వాతి మలీవాల్ ప్రధాన ఆరోపణ. బిభవ్ మిశ్రాపై ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే, మలీవాలే తన పట్ల దురుసుగా ప్రవర్తించారని బిభవ్ కుమార్ ప్రత్యారోపణ చేశారు.
కాగా, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం ఇప్పటి వరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఈ ఉదంతం వెనుక బీజేపీ హస్తం ఉందని ఆప్ ఆరోపిస్తోంది. మలీవాల్‌పై ఉన్న పాత ఏసీబీ కేసు పేరుతో ఆమెను పావులాగా ఉపయోగించి కేజ్రీవాల్‌ను మరో కేసులో ఇరికించడానికి బీజేపీ యత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. బిభవ్ కుమార్ తనను కాలితో కడుపులో తన్నాడని, తీవ్రంగా కొట్టాడని, ఆ బాధతో తాను నడవలేకపోయానని మలీవాల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. మలీవాల్ ఎడమ కాలు, చెంపపైన గాయాలున్నట్లు మెడికల్ రిపోర్టు సైతం నిర్ధారించింది.
అయితే, తనపై జరిగిన దాడిని రాజకీయం చేయవద్దని ప్రత్యేకించి బీజేపీని మలీవాల్ కోరడం గమనార్హం. కాగా, ఆమె ఆరోపణలు నిజం కాదంటూ ఆప్ ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మలీవాల్ ముఖ్యమంత్రి నివాసం నుంచి బైటికి మామూలుగా నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలున్నాయి. ఈ క్రమంలో ఓ మహిళా పోలీసుతో ఆమె వాదిస్తున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. దీనికి ప్రతిగా మలీవాల్ కూడా ఓ వీడియో విడుదల చేశారు. తాజాగా బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం కోసం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
తనను అరెస్టు చేయడానికి కొద్ది గంటల ముందు బిభవ్ కుమార్ తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయినట్లు తెలిసిందని, తాను విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంటూ పోలీసులకు ఓ ట్వీట్ పంపారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించకపోవడంపై బీజేపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. సొంతపార్టీ మహిళా ఎంపీపై తన వ్యక్తిగత సిబ్బంది దాడి చేస్తే ముఖ్యమంత్రి ఒక్కమాట కూడా మాట్లాడక పోవడం షాక్‌కు గురి చేసిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
దీనిపై ఆయన ఎలాంటి చర్యా తీసుకోలేదని కూడా ఆరోపించారు. బిభవ్ కుమార్‌ను వెంట పెట్టుకుని కేజ్రీవాల్ లక్నో వెళ్లడంపైనా బీజేపీనేతలు మండిపడ్డారు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు కేజ్రీవాల్ నివా సానికి వెళ్లి సాక్ష్యాధారాలను సేకరించారు. ఇది జరిగిన కొద్ది గంటలకే పోలీసులు బిభవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
స్వాతి మలీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి ముఖ్యనేతగా ఉన్నారు. అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్‌తోపాటు ఆమె కూడా పాల్గొన్నారు. ఈ సాన్నిహిత్యంతోనే కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015లో స్వాతి మలీవాల్‌ను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించారు. అప్పటి నుంచి 2024లో ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యేంత వరకు ఆమె ఆ పదవిలో కొనసాగారు.
ఆమె పదవీ కాలంలో కమిషన్ 1.7 లక్షలకు పైగా మహిళలపై దాడులు, గృహహింస, ఇతర నేరాలకు సంబంధిం చిన కేసులను పరిష్కరించింది. ఆమె పనితీరు కారణంగా ఈ ఏడాది కేజ్రీవాల్ ఆమెను రాజ్యసభకు పార్టీ తరఫున నామినేట్ చేశారు. అయితే, ఇం తకాలంగా కేజ్రీవాల్‌కు ఎంతో విశ్వసనీయురాలుగా ఉన్న మలీవాల్ ఒక్కసారిగా ఆయనపై కుట్రకు ఎలా పాల్పడతారనేదే ప్రశ్న. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆప్‌కు, కేజ్రీవాల్‌కు ఎన్నికల వేళ ఈ ఉదంతం మరిన్ని సమస్యలు తెచ్చి పెడుతుందా? అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.






