8 May, 2026 | 11:06 AM

కళ తప్పుతున్న పల్లెలు

19-05-2024 12:00 AM

పూర్వం గ్రామాల్లో కులవృత్తులు చాలా బలంగా వుండేవి. వాటికి ఆదరణ కూడా ఎక్కువగా ఉండేది. అందరూ ఒకరిపై ఒకరు ఆధారపడి మరీ జీవించేవారు. ఈ రోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేయ గలుగుతున్నారు. శ్రమ తక్కువ ఆదాయాలు ఎక్కువ. కులవృత్తుల కోసం ఎవరూ చూడటంలేదు. వాటిని ఇష్టపడటం లేదు కూడా. తరాలు దాటి పోయాయి. కులవృత్తులకు ఆదరణ తగ్గిపోయింది. చాలామంది వాటికి దూరమవుతున్నారు. కారణం, ఆదరణ, ఆదాయాలు లేకపోవడమే.

ఆ రోజుల్లో ప్రజలు మామ, అత్త, తాత, నానమ్మ, అమ్మమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బాబాయ్, పిన్ని అని ఎంతో మర్యాదగా గౌరవంగా పిలుచుకునేవారు. ఈరోజు ఆ పిలుపులు లేవు. కాలం మారింది. ఎంతో చైతన్యవంతులమైన మనం మన పిల్లలకు ఎవరు ఏమవుతారో నేర్పడం లేదు. ఆ రోజుల్లో కులవృత్తి చేసేవారికి ఎనలేని గౌరవం, పేరు ప్రతిష్ఠలు, మర్యాదలు ఉండేవి. కానీ, ఈ రోజుల్లో కులవృత్తిపై ఆధారపడితే బతుకు బారంగా మారుతోంది. ఆ వృత్తులు చేసేవారి జీవితం దుర్భరంగా ఉంటున్నది. కులవృత్తులలో ప్రతి వాటికి మిషన్లు వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తులను చేయటం సులభమైంది. అందుకే, ఏ కులం వారు ఆ వృత్తి చేయడం లేదు. కులవృత్తులను నమ్ముకుంటే కూడుపెట్టలేని పరిస్థితులు నెల కొన్నాయి.  

ఈరోజు పచ్చని పల్లెలు మండే కొలిమిలా సెగలు కక్కుతున్నాయి. కారణం, మద్యం ఏరులై పారుతున్నది. ప్రశాంత వాతావరణం దెబ్బతిన్నది. ఎవరికి వారే మిగిలారు. ఆప్యాయతలు ఆవిరయ్యాయి. మంచితనం మసకబారిపోయింది. నీతి నియమాలు, మంచి మర్యా దలు మచ్చుకైనా లేవు. ప్రభుత్వాలు కులాలను ఓటుబ్యాంకులుగా చూస్తు అవసరాల కుటిల ప్రేమను చూపుతున్నాయి. కొన్ని కులాలకే న్యాయం జరుగు తుం ది. మిగతా కులాలకు, కులవృత్తులను పట్టించుకోవ డంలేదు. కులాల మధ్య భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఒక్కటే అన్న భావనతో వివిధ వృత్తులు చేయడానికి యువకులు ముందుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రొత్సహించాలి. ఇప్ప టికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కులవృత్తులకు ఋణ సదు పాయం కల్పించాలి. అపుడే కులవృత్తులను కాపాడు కునే అవకాశాలు ఉంటాయి.         

  కామిడి సతీష్ రెడ్డి