15 July, 2026 | 1:28 AM

నాటకం.. సినిమా రెండూ వేర్వేరు మాధ్యమాలు

15-07-2026 01:27 AM

ఈ సినిమా తెలంగాణ యాసలో డైలాగ్స్ ఉంటాయి. దీనికి కారణం --మా దర్శకుడు భరత్ దర్శన్ సిద్ధిపేటకు చెందినవారు. ఈ మధ్యకాలంలో చాలామంది దర్శకులు తమ ప్రాంతాల కథలు, పాత్రలను చెప్పడానికి ఆసక్తి చూపుతున్నారు. నటుడిగా నాకు తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, గుంటూరు.. ఇలా అన్ని ప్రాంతాల యాసల్లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. 

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శక త్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్‌రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో తిరువీర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే... 

ఒక అమ్మాయి గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే ఆమె శరీరం నుంచి ఎలక్ట్రిక్ షాక్ జనరేట్ అవుతుంది. అలాంటి అమ్మాయి జీవితంలోకి ప్రేమించిన అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆమె ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా? అనేదే కథ. చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి ఇది ఒక అరుదైన పరిస్థితి ఆధారంగా రూపొందించిన కథ. ఇందులోని కాన్‌ఫ్లిక్ట్ చాలా కొత్తగా ఉంటుంది. -ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎంత నవ్విస్తుందో, అంతే భావోద్వేగానికి గురి చేస్తుంది. మంచి హ్యూమర్ తోపాటు కుటుంబ భావోద్వేగాలు కూడా ప్రేక్షకులను కదిలిస్తాయి. 

ఇంతకుముందు ఐశ్వర్య రాజేశ్‌తో ‘టక్ జగదీష్’ చిత్రంలో పనిచేశా. కానీ హీరో, హీరోయిన్‌గా మేం కలిసి నటించడం ఈ సినిమాలోనే తొలిసారి. ఐశ్వర్యతో సీన్స్ చేసేటప్పుడు చాలా విషయాలు చర్చించేవాళ్లం. ఆమె తన అనుభవాలను నాతో పంచుకునేవారు. అది నాకు చాలా ఉపయోగపడింది. కో-స్టార్స్ మంచి పెర్ఫార్మర్స్ అయితే మనం కూడా ఇంకా బాగా నటించడానికి ప్రయత్నిస్తాం. ఒక నటుడికి ఎదుటి నటుల రియాక్షన్‌ను బట్టి కూడా నటించే అవకాశం పెరుగుతుంది. ఆ విషయంలో ఐశ్వర్య రాజేశ్, నిత్యా మీనన్ లాంటి మంచి నటీమణులతో పనిచేయడం ఎప్పుడూ ఛాలెంజింగ్‌గా ఉంటుంది. వాళ్ల తో కలిసి పనిచేసినప్పుడు మన నటన కూడా మరింత మెరుగవుతుంది. 

నేను నాటకాలు రాసేవాన్ని. నాటకం ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. సినిమా మరో ప్రత్యేక మాధ్యమం. నాటకాలు రాసేటప్పుడు ఒక చిన్న కథను తీసుకుని నటీనటులతో కలిసి ఇంప్రొవైజ్ చేసేవాడిని. సినిమా అనేది చాలా పెద్ద బాధ్యత, భారీ వ్యయంతో కూడుకున్నది. ప్రస్తుతం నటనపైనే పూర్తిగా దృష్టి పెట్టాను. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ప్రమోషన్స్ మరో ఎత్తు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నటన కంటే ప్రమోషన్స్ చేయడమే ఎక్కువ ఛాలెంజింగ్‌గా ఉంది. మహిళలకు సినిమా నచ్చితే కుటుంబమంతా చూస్తుంది. ఆ లెక్కన నేను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యానని భావిస్తున్నా. ’ఓ.! సుకుమారి’తో మరింత దగ్గరవుతానని నమ్ముతున్నా. ఇక నా కొత్త ప్రాజెక్టులంటే.. ‘భగవంతుడు’తోపాటు మరో రెండు సినిమాలు చేస్తున్నా. వాటి వివరాలను త్వరలో మేకర్స్ ప్రకటిస్తారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా.