14 March, 2026 | 3:00 AM

గ్యాస్ కొరత లేదు

14-03-2026 01:38 AM
  1. సోషల్ మీడియాలో ప్రచారంతోనే ఈ దుస్థితి

గృహ, దవాఖానలు, విద్యా, ప్రభుత్వ సంస్థలకు పాధాన్యం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. ప్రజల్లో లేని పోనీ అపోహలు సృష్టించి వారిని గందరగోళంలో పడేసేలా జరుగుతున్న ప్రచారంపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సర ఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న దృష్టా మంత్రి ఉత్తమ్ శుక్రవారం సచివాలయంలో సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణా రావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సీఎస్ ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎల్పీజీ గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి గందరగోళానికి గురికావొద్దని, గృహ వినియోగదారులకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించేందుకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా తిప్పి కొట్టారు.

ఇటువంటి గందరగోళం ఏర్పడినందునే రో జువారీగా 72 శాతం బుకింగ్స్ జరుగుతున్నాయని, గృహ వినియోగదారులతోపాటు ఆసుపత్రిలకు, విద్యాసంస్థలకు, వృద్ధాశ్రమలకు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధన్యతా క్రమం లో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 810 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా రోజువారీగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతున్నదని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్టు ఎక్కడా నమోదు కాలేదని చెప్పారు.

అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే కఠినచర్యలు తప్పవన్నారు. గ్యాస్ బ్లాక్ దందాకు పాల్పడినందు కు ఇప్పటివరకు 288 కేసులు నమోదు చేశామని చెప్పా రు. డిస్ట్రిబ్యూటర్లు ఇదే విధంగా ప్రవర్తిస్తే మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయించిందని తెలిపారు.

కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకమారు ఎల్పీజీ బుక్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించా రు. అదేసమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవద్దని, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని, ప్రభుత్వం పరిస్థితులను సమీక్షిస్తుందని పేర్కొన్నారు.