4 August, 2026 | 2:48 AM

ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందించేందుకు శిక్షణ తరగతులు

04-08-2026 01:49 AM

జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రయ్య 

మంచిర్యాల టౌన్, ఆగస్టు 3: ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య సేవలు అందించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి, అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

శిక్షణ అనేది ప్రతి ఉపాధ్యాయుడు తన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకొని తన నైపుణ్యాలను నవీకరించుకోవడానికి ఒక గొప్ప అవకాశమన్నారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు (సీ డబ్ల్యూ ఎస్ ఎన్) విద్యను అందించడం ఎంతో అదృష్టకరమైన బాధ్యత అని, వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడంలో ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు.

శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రతి ప్రత్యేక విద్య ఉపాధ్యాయుడు తమ ఐఆర్సీ కేంద్రాలలో సమర్థవంతంగా అమలు చేసి, విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. అలాగే, సదరం క్యాంపు నిర్వహణకు అవసరమైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, అర్హులైన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోర్స్ కోఆర్డినేటర్ జంబోజు సత్తయ్య, కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ కె. కృష్ణమూర్తి, కోర్స్ ఇన్చార్జ్ కె. చౌదరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రమేష్, డీఆర్పీలు, ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు, ఐఈఆర్పీలు పాల్గొన్నారు.