13 March, 2026 | 4:56 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

13-03-2026 01:08 AM

మృతదేహాలను తన సిబ్బందితో కలిసి అంబులెన్సులో ఆసుపత్రికి తరలించిన మంత్రి వాకిటి

షాద్‌నగర్, మార్చి 12 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీకి చెందిన యువకులు గురువారం పెద్దషాపూర్ వయా మదనపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మదనపల్లి సమీపంలో వేగంగా వచ్చిన ఒక గుర్తు తెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టి, వారి పైనుండి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న సూరజ్, బిక్కి అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సూరజ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుండగా, బిక్కి పిజిలోని చిన్ను ఇంజనీరింగ్‌లో ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సిసిటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా అదే సమయంలో మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్ పర్యటనకు వెళ్తూ ఈ ప్రమాదాన్ని గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. రక్తపు మడుగులో భీతావహంగా ఉన్న మృతదేహాలను తన సిబ్బందితో కలిసి పక్కకు తొలగించారు. అంబులెన్సును పిలిపించి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.