23 May, 2026 | 12:55 AM

విజయ్ క్యాబినెట్‌లోకి మరో ఇద్దరు

23-05-2026 12:00 AM
  1. వీసీకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలకు చోటు
  2. వన్ని అరసు, ఎంఎం షాజహాన్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అర్లేకర్
  3.   34కి చేరిన తమిళనాడు మంత్రుల సంఖ్య

చెన్నై, మే 22: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గాన్ని శుక్రవారం మరోసారి విస్తరించారు. తాజాగా మరో ఇద్దరు మంత్రులు ఆయన క్యాబినెట్‌లో చేరారు. టీవీకేకు బయట నుంచి మద్ద తిస్తామని ఇంతకుమందు ప్రకటించిన విడుదలై చిరుతైగళ్ కట్చి(వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) అధికార కూటమిలో చేరాయి. ఈ రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేశారు.

చెన్నై లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. వీసీకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు వన్ని అరసు, ఎంఎం షాజహాన్‌తో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. విజ య్, ఆయన మంత్రివర్గ సహచరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరి చేరికతో ఈ రెండు పార్టీలు అధికారికంగా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగం అయ్యాయి. 23 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ విస్తరణ చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ముఖ్యమంత్రి విజయ్ మే 10న తొలిసారిగా తొమ్మిది మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజా విస్తరణతో తమిళనాడులో క్యాబినెట్ మంత్రుల సంఖ్య 34కి చేరింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తమిళనాడులో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా 35 మంది సభ్యులు ఉండవచ్చు. అంటే ఇంకా ఒక స్థానం ఖాళీగా ఉంది.

వన్ని అరసు మంత్రివర్గంలో చేరికతో, క్యాబినెట్‌లో దళిత మంత్రుల సంఖ్య ఎనిమిదికి చేరింది. తమిళనాడు చరిత్రలో ఇంత ఎక్కువ దళిత దామాషా ప్రాతినిథ్యం మునుపెన్నడూ లేదు. కాగా, ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వ విశ్వాస తీర్మానికి అనుకూలంగా ఓటు వేసిన అన్నాడీఎంకే రెబల్ వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరికి కూడా టీవీకే ప్రభుత్వంలో చోటు దక్కలేదు.