13 June, 2026 | 1:29 PM

భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన

13-06-2026 12:54 PM

సరికొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

యుద్ధతంత్రానికి సిద్ధంగా ఉండాలని.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన 

హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో(Dundigal Air Force Academy) కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్ పరేడ్ ప్రారంభమైంది. పరేడ్ కు రివ్యూయింగ్ ఆఫీసర్ గా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Union Defence Minister Rajnath Singh) హాజరయ్యారు. పరేడ్ లో సుఖోయ్, సూర్యకిరణ్, సారంగ్ విన్యాసాలు చేశారు. ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ ట్రైనీలకు వెంగ్స్, బ్రెవెట్స్ అందజేశారు. వియత్నాం ట్రైనీలకూ శిక్షణ పూర్తి ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. మెరిట్ లో అగ్రస్థానంలో నిలిచిన క్యాడెట్లకు 'ప్రెసిడెంట్స్ ప్లాక్' అవార్డులు ఇచ్చారు. పరేడ్ ప్రారంభంలో ఆకాష్ గంగా, ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్ విన్యాసాలు చేశారు.

యుద్ధ స్వరూపం మారుతున్న తీరుకు సిద్ధంగా ఉండాలని యువ అధికారులకు పిలుపునిస్తూ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) శనివారం భారత వైమానిక దళం నుండి పట్టభద్రులవుతున్న క్యాడెట్లను కోరారు. సంప్రదాయ సైనిక మోహరింపుల కంటే అధునాతన వ్యవస్థల ద్వారానే యుద్ధాలు ఎక్కువగా జరుగుతున్న భవిష్యత్ సంఘర్షణల కోసం వారు సాంకేతికంగా నిపుణులై, మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. గతంలో సైనికులు, పరికరాలు అనే రెండు అంశాలే ప్రధానంగా ఉండేవని పేర్కొన్న రాజ్‌నాథ్ సింగ్, రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్స్ వంటి వ్యవస్థలను వినియోగిస్తున్న ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో శత్రువు కంటికి కనిపించడని హెచ్చరించారు.

ఎయిర్‌ఫోర్స్‌ 1947-48లో పాకిస్థాన్ తో యుద్ధగతినే మార్చేసిందని సూచించారు. 1971లో 13 రోజుల్లో యుద్ధం ముగిసిందన్న రాజ్‌నాథ్ అలాంటి ఎయిర్‌ఫోర్స్‌లో మీరు అడుగుపెడుతున్నారని తెలిపారు. ఈ రోజుల్లో యుద్ధం తీరు మారిపోయింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో వాయుసేన ప్రదర్శించిన తెగువ, ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.