25 August, 2026 | 9:58 PM

పర్యావరణ పరిరక్షణే రేపటి తరానికి రక్షణ

25-08-2026 07:51 PM

చివ్వెంల: “పర్యావరణ పరిరక్షణ–రేపటి తరానికి రక్షణ” అనే నినాదంతో చివ్వెంల గ్రామపంచాయతీలో మంగళవారం నిర్వహించిన వనమహోత్సవంలో మండల ప్రత్యేకాధికారిణి సులోచనారాణి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా అవి పెద్దవయ్యే వరకు క్రమం తప్పకుండా నీరు పోసి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు ప్రజలు ముందుకు రావాలని, ఇళ్ల పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రహదారుల వెంట విరివిగా మొక్కలు నాటాలని సూచించారు.

చెట్లు పెరగడం వల్ల పర్యావరణ సమతుల్యత కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందని తెలిపారు. ప్రతి కుటుంబం కొన్ని మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటే గ్రామం పచ్చని వనంగా మారుతుందని అన్నారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో వనమహోత్సవ కార్యక్రమాలను కొనసాగించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్, ఏ ఓ వెంకటేశ్వర్లు,ఎంపీఓ దయాకర్ , సర్పంచ్ కళ్యాణి నాగేష్ , ఉపసర్పంచ్, ఏపీఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు.