13 April, 2026 | 6:08 PM

నీతి అయోగ్ ద్వారా గ్రామాల అభివృద్ధి

13-04-2026 05:02 PM

నీతి ఆయోగ్ ప్రత్యేక అధికారి రంజిత్ కుమార్

కలెక్టర్ హరితతో కలసి అభివృద్ధి పనులు, ఆసుపత్రి సేవల పరిశీలించిన

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తిర్యాణి మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సేవల అమలును పరిశీలించేందుకు  సోమవారం జిల్లా కలెక్టర్ హరిత తో కలిసి నీతి ఆయోగ్ ప్రత్యేక అధికారి రంజిత్ కుమార్ తిర్యాణి మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పలు అంశాలపై ఆరా తీశారు. నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని వారు పరిశీలించారు.

అక్కడి సౌకర్యాలు, పిల్లల హాజరు, పౌష్టికాహారం పంపిణీ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అంగన్‌వాడీ టీచర్‌ను అడిగి తెలుసుకున్నారు. నీతి ఆయోగ్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, నాణ్యతపై అధికారులతో సమీక్షించారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడవద్దని సూచించారు. తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రిని  తనిఖీ చేశారు. ఔట్‌పేషెంట్ (ఓపీ), ఇన్‌పేషెంట్ (ఐపీ) రిజిస్టర్లను పరిశీలించి, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సిబ్బంది, వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

మండలంలో గర్భిణుల ప్రసవాలు గ్రామాల్లో జరుగుతున్నాయా లేదా ఆసుపత్రిలోనే జరుగుతున్నాయా అని ప్రత్యేక అధికారి రంజిత్ కుమార్ ప్రశ్నించగా, అన్ని డెలివరీలు ఆసుపత్రిలోనే జరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహిస్తున్న వైద్య బృందాన్ని అభినందించారు.ఈ పర్యటనలో  డీఎంహెచ్ఓ సీతారాం, ఎమ్మార్వో శ్రీనివాస్, ఎంపీడివో మల్లేష్, డాక్టర్లు కృష్ణ, అక్షయ్, పల్లవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.