పులుల పెరుగుదల.. ప్రకృతి పరిరక్షణకు నిదర్శనం
* అమ్రాబాద్‌లో 10 నుంచి 44కు చేరిన సంఖ్య
* ‘వనజీవ విద్య’కు శ్రీకారం
అచ్చంపేట: ప్రపంచ పులుల దినోత్సవం (జూలై 29) సందర్భంగా హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హైటికోస్), అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘వనజీవ విద్య’ పేరుతో ఏడాది పాటు నిర్వహించనున్న పర్యావరణ, వన్యప్రాణి అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని లింగాల రేంజ్ గిరిజన సంక్షేమ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 215 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
* చిన్ననాటి నుంచే అవగాహన
వన్యప్రాణులు, అడవుల పరిరక్షణపై విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే అవగాహన పెంపొందించడమే ‘వనజీవ విద్య’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని హైటికోస్ నల్లమల ల్యాండ్‌స్కేప్ కోఆర్డినేటర్ బాపురెడ్డి తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవం ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. పులుల సంరక్షణతో పాటు వాటి ఆవాసాలను కాపాడటం ద్వారా మొత్తం అటవీ పర్యావరణ వ్యవస్థను పరిరక్షించవచ్చని పేర్కొన్నారు.
* ఆహార గొలుసుపై అవగాహన
హైటికోస్ రీసెర్చ్ అసోసియేట్ అఖిల్ విద్యార్థులకు ఆహార గొలుసు, జీవవైవిధ్యం, సుస్థిర అభివృద్ధిలో వాటి ప్రాధాన్యాన్ని సులభంగా వివరించారు. పర్యావరణ సమతుల్యతలో ప్రతి జీవికి ఉన్న ప్రాధాన్యాన్ని విద్యార్థులకు తెలియజేశారు.
* 10 నుంచి 44కు..
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు బయాలజిస్ట్ రవికాంత్ తెలిపారు. 2016లో కెమెరా ట్రాప్‌ల ద్వారా 10 పులులను గుర్తించగా.. నిరంతర సంరక్షణ చర్యలు, శాస్త్రీయ పర్యవేక్షణ, పులుల ఆవాస ప్రాంతాల పరిరక్షణ ఫలితంగా 2026 నాటికి వాటి సంఖ్య 44కు చేరిందని వివరించారు. పులుల సంఖ్య పెరగడం నల్లమల అటవీ పర్యావరణ వ్యవస్థ పరిరక్షణలో చేపట్టిన చర్యలకు నిదర్శనమన్నారు.
* చిత్రలేఖన, వ్యాసరచన పోటీలు
అటవీ శాఖ బీట్ అధికారి మురళి ప్రపంచ పులుల దినోత్సవం ఆవిర్భావం, పులుల సంరక్షణ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. అనంతరం చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు స్టీల్ వాటర్ బాటిళ్లను బహుమతులుగా అందజేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత జీవన విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా స్టీల్ బాటిళ్ల వినియోగంపై అవగాహన కల్పించారు.
* ఏడాది పాటు కార్యక్రమాలు
‘వనజీవ విద్య’ కార్యక్రమంలో భాగంగా రానున్న ఏడాది కాలంలో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులను భవిష్యత్‌లో ప్రకృతి, వన్యప్రాణుల పరిరక్షణలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ బీట్ అధికారులు ఖాదర్ పాషా, ప్రవీణ్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, హైటికోస్ సిబ్బంది ఇమ్మాన్యుయేల్, ప్రేమ్‌కుమార్, ఆంజనేయులు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.






