19 June, 2026 | 4:56 PM

మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి

19-06-2026 03:32 PM

అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మట్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మార్మట్ సూచించారు. శుక్రవారం కాగజ్‌నగర్ మున్సిపాలిటీని సందర్శించి పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, పన్నుల వసూళ్లు, ప్రజా సేవల అమలు తీరును సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ షహీన్ సుల్తానా, వార్డు కౌన్సిలర్లతో సమావేశమై పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఆనంతరం ఎల్లగౌడ్ తోట పార్క్‌ను సందర్శించిన అదనపు కలెక్టర్ అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు, పరిశుభ్రత, పచ్చదనం, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పార్కు నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు పచ్చదన పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.బి. రామాదేవి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం. శంకర్, పర్యావరణ ఇంజనీర్ డి. ప్రణీల్ కుమార్,అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.