19 June, 2026 | 5:58 PM

మంథని నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పుట్ట మధుకర్ చౌకబారు ఆరోపణలు

19-06-2026 04:55 PM

రామగిరి లో విలేకరుల సమావేశంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్

మంథని,(విజయ క్రాంతి): మంథని నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకనే మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ విమర్శించారు. శుక్రవారం రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలోని మంథని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజకీయ మనుగడ కోసమే విషప్రచారం

ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ, మంథనిలో శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పుట్ట మధుకర్ భయపడుతున్నారని, నియోజకవర్గంలో రాజకీయ మనుగడ కోసమే నిరాధారమైన ఆరోపణలు చేస్తూ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు మెరుగైన వైద్యం, మౌలిక వసతులు, కమ్యూనిటీ భవనాలు వంటి సదుపాయాలు కల్పిస్తుంటే, అది చూడలేక పుట్ట మధుకర్ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

కాళేశ్వరం నిధులపై ఆరోపణలు విడ్డూరం

కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులపై పుట్ట మధుకర్ చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. పనులే ప్రారంభం కాకముందే 100 కోట్లు జేబులోకి వెళ్లాయని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వారికి అలవాటైన పద్ధతులనే మా నాయకుడికి ఆపాదిస్తున్నారని, మీ ప్రభుత్వ హయాంలో యాదాద్రి అభివృద్ధి పేరుతో ఎన్ని వందల కోట్లు మీ వాళ్లు జేబులు నింపుకున్నారో ప్రజలకు తెలుసని ఘాటుగా సమాధానమిచ్చారు.

హెచ్చరిక

రాష్ట్రంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, గూడెం గుట్ట వంటి పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తుంటే ప్రజలు హర్షిస్తుంటే, కేవలం ఉనికిని చాటుకోవడానికి ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతమైతే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రొడ్డ బాపన్న, కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ కాటం సత్యం, నాయకులు మైదం ప్రసాద్ తో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.