సరస్వతి కాలువకు నీటి విడుదల
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గం(Nirmal Constituency)లోని సోన్, లక్ష్మణచాందా, మామడ మండలాల రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సరస్వతి కాలువకు ఆదివారం ఉదయం నీటిని విడుదల చేయనున్నట్లు నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి తెలిపారు. శనివారం నిర్మల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా మూడు మండలాల్లో రైతులు(Farmers) సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని భీమ్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజాప్రతినిధులు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావును కలిసి సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారని చెప్పారు.
రైతుల సమస్యను గుర్తించిన శ్రీహరిరావు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారని, అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా విజ్ఞప్తి చేశారని భీమ్‌రెడ్డి తెలిపారు. శ్రీహరిరావు విజ్ఞప్తిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో చర్చించి ఆదివారం ఉదయం సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో నీటి విడుదలకు మార్గం సుగమం కావడంతో మూడు మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
సోన్, లక్ష్మణచాందా, మామడ మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయని, ఈ నీటి విడుదలతో ఆయా ప్రాంతాల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని భీమ్‌రెడ్డి అన్నారు. నీటిని వారాబందీ పద్ధతిలో విడుదల చేయనున్నందున రైతులు సమన్వయంతో నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆత్మ చైర్మన్ కొండ్రు రామ్‌రెడ్డి, గండి రామన్న , దత్తసాయి ఆలయ చైర్మన్ కొట్టె శేఖర్, లక్ష్మణచాందా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేశ్‌రెడ్డి, మామడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ , బాపయ్య, ప్రతాప్ రెడ్డి , గంగారెడ్డి కలగిరి తదితరులు పాల్గొన్నారు.