27 July, 2026 | 3:54 PM

మహిళా శక్తి సూపర్ మార్కెట్లు ఏర్పాట్లు చేస్తాం

30-05-2026 07:02 PM

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం

ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా శక్తి సూపర్ మార్కెట్

ప్రభుత్వ విప్,  ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): మహిళా శక్తి సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్,  ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని బృందావన్ క్లాసిక్ గార్డెన్‌లో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడేలా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో మహిళా శక్తి సూపర్ మార్కెట్లు  ఏర్పాటు చేసి, మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములుగా, షేర్‌హోల్డర్లుగా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సూపర్ మార్కెట్లను మహిళలే నిర్వహిస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా సేవలు అందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మహిళలకు ఉపాధి, గౌరవం కలుగుతుందని చెప్పారు. మహిళలను భాగస్వాములుగా చేస్తే ఈ వ్యవస్థ భవిష్యత్తులో పెద్ద కార్పొరేట్ సంస్థగా ఎదగగలదని ఎమ్మెల్యే సూచించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సానుకూలంగా స్పందించి, వెంటనే విధివిధానాల రూపకల్పనకు అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా, నియోజకవర్గంలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తక్కువ లీజుతో ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం, రిటైల్ రంగంలో శిక్షణ అందించడం ద్వారా మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కృతజ్ఞత సభలో  వేలమంది మహిళలు పాల్గొని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో రైస్ మిల్లులు, ఇతర పారిశ్రామిక యూనిట్ల నిర్వహణలో కూడా మహిళలకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు.