11 March, 2026 | 5:11 AM

ప్రగతి ప్రణాళికతో అన్ని వర్గాల సంక్షేమం

11-03-2026 12:28 AM

రంగారెడ్డి, మార్చి 10(విజయక్రాంతి):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణతో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఒక్క ఫైలు పెండింగ్లో ఉండకూడదని ఆయన ఆదేశించారు. ఉగాది నాటికి సామూహిక గృహప్రవేశాలు చేసేలా, తుది దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, జనన మరణ ధృవీకరణ పత్రాల దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, ఈ నెల 14 నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్‌ఓ సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీవో సురేష్ తదితరులు పాల్గొన్నారు.