16-02-2026 12:00:00 AM
మహానగరం రద్దీలో-
ఒక అనామక చిత్రం అతడు
బతుకు నావను ఈదడానికి
ఒంటరి బాటసారిగా
తనను తాను పరీక్షించుకోవడానికి
అపరిచిత ప్రయాణికుడు
జీవితం మెట్లు ఎక్కడానికి జీతం
పురష లక్షణంలో కొన్ని అడుగులు
తడబడినా, ఒడిదుడుకులు
కంగారు పెట్టినా లెక్క పెట్టని మనుషుల మధ్య
తన లెక్కను సరి చేసుకుంటూ
గురుబ్రహ్మ అవతారమెత్తాడూ
ఇక లెక్క తప్పదని అనుకున్నాడు
ఉద్యోగం నిలకడ కాదని తెలిసినా
ఏదో ఒకరోజు తన బతుకు కూడిక
శూన్యం కాదని ఒక భరోసాతో నడకకు
ప్రభువుల ఆగ్రహం వచ్చింది.
ఇతని నిగ్రహానికి, వారి అహానికి శిక్షగా
రోడ్డున పడ్డాడు..
నిన్నటిదాకా బరువుగా ఉండే జేబులు
బక్కచిక్కి బతుకును భయపెట్టడం
తనను తాను ఓదార్చుకుంటూ
వేలిసిన బతుకు రంగు చిత్రానికి
రంగులు వేయడం కోసం
తన భుజాన్ని తానే తడుముకున్నాడు.
అమ్మనాన్నలకు చెప్పి బాధపెట్టడానికి
వారు ఎప్పుడో దూరమయ్యారు.
రోడ్డు మీద అడుగుల కొలతల మధ్య
తప్పటడుగుల్ని సరిచేసుకుంటూ
ఒంటరిపోరటమయ్యాడు.
చేజారిన ఉద్యోగం చిరునామా వెతుకుతూ
ఏ మహానగరం కూడలిలో ఎదురుపడి
నీ తోడు నేను ఉన్నాను అంటుందని
పదకొండు సంవత్సరాలుగా పెద్దవారికి నమస్కారాలతో
వారి అంతస్థుల మెట్లు లెక్కపెడుతూ
వారు భుజం తప్పినప్పుడూ
మోడుగా మారిన బతుకు చిగురు
తోడుగుతుందని, చీడ చెదిరిపోతుందని
అనుభవసారంతో
ఒక అనాథ పర్వం నిన్నను వదిలి
నేటి మీద ధ్యాసతో
జీవన సూత్రానికి
కొత్త దారులు వెతుకుతూ
ఈ అమాయక విక్రమార్కుడు
కరుడుగట్టిన అమాయకుడు
ప్రతిఒక్కరు సానుభూతి వాక్యాన్ని
దేవుడి ప్రసాదంగా స్వీకరిస్తూ
ఇంకా మనుషుల్లో మనసు చావలేదని
జీవన చదరంగంలో పావుగా
తన బతుకు ఆటను గెలిపిస్తారని
సమాధానంగా నిలుస్తారని అన్వేషణ
వయసు జారిపోతుంది
పరుగు మాత్రం ఆగడం లేదు
మరో పది సంవత్సరాలు
పరుగెడితే
జీవితానికి జీతం కూడా వుండదు.
వయసు మీదపడి, మిగిలే నిట్టూర్పు
చివరి వాక్యంగా మిగులుతుంది
కొండయ్య పరుగుతీస్తున్నాడు
ఏదో ఒక మలుపులో
తన అదృష్టరేఖ ఎదురుచూస్తు ఎదురీత
కాలం చేతిలో కీలుబొమ్మగా మిగులుతాడా ?!
బంగారు కొండగా ఎదుగుతాడో
చూడాలి మరి !!