16-02-2026 12:00:00 AM
అనాది కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు కవులు, రచయితలు తమ కలాలకు పదును పెడుతూనే ఉన్నారు. సమాజానికి పట్టిన భ్రష్టును వదిలించే క్రమంలో అక్షరాలను ఆయుధాలుగా మారుస్తున్నారు. అదే బాటలో నడుస్తూ రచయిత్రి విశ్వైక సామాజిక చైతన్యం కోసం తపించి, మదించి రూపొందించిన కవితా సంకలనమే ‘తొలి సంతకం‘. సమాజంలోని ప్రతి అంశాన్ని స్పృశిస్తూ, పాఠకుల్లో ఆలోచన రేకెత్తించేలా సామాన్య పరిభాషలో ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకువచ్చారు.
జీవిత గమ్యం చేరాలంటే ఎదురయ్యే ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కోవాలని కవయిత్రి ఆకాంక్షించారు. గెలుపు దారిలో వచ్చే కష్టనష్టాల గురించి వివరిస్తూ.. ’సమరం సాగిస్తే గెలుపే నీదవునులే’ అని మొదటి కవితలోనే స్పష్టం చేశారు. అపజయం పొందిన వారికి సమయం విలువ బాగా తెలుస్తుందని విశ్లేషిస్తూనే, విజయగాథలో పిల్లల తెలివితేటలను తూకం వేయకూడదని హితవు పలికారు.
వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తేనే అద్భుతాలు సాధించగలరని ఆత్మస్థైర్యం నింపారు. సమాజంలో నేటికీ కొనసాగుతున్న లింగ వివక్షపై ఆమె గొంతెత్తారు. ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే చిదిమేసే క్రూరత్వాన్ని ఎండగట్టారు. ’జీవ జాతుల రక్షణ జాబితాలో ఆడజాతి చేరకముందే కళ్లుతెరిచి చూడండి.. కాబోయే అమ్మను కాపాడండి’ అని ఆమె చేసిన హెచ్చరిక ఆలోచింపజేస్తుంది. అమ్మ విలువ ఒక అమ్మ అయితే కానీ.. తెలియదని, ఆమె చెప్పిన ప్రతి మాట పిల్లల బంగారు భవిష్యత్తు కోసమేనని ‘అమ్మంటే అలానే’ కవితలో గుర్తుచేశారు.
మధురమైన బాల్యం
తండ్రి కూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని ‘నాన్న కూచి’ కవితలో అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రతి తండ్రి తన కూతురిని మహారాణిలా భావిస్తాడని, నాన్నే తన తొలి గురువు అని ఎంతో గౌరవంతో చాటుకున్నారు. అలాగే అన్యోన్యమైన చిరునవ్వుకు చిరునామా అయిన బాల్యాన్ని గుర్తు చేస్తూ.. ఆ రోజులు మరుపురాని జ్ఞాపకాలను ‘బాల్యధనం’ కవితలో వివరించారు. నేటి యాంత్రిక జీవనంలో పాత తరం ఆత్మీయతలు, అనురాగాలు మృగ్యమైపోతున్నాయని ఆవేదన చెందారు. అన్నపూర్ణ వారసుడైన రైతుకు, మట్టికి ఉన్న విడదీయలేని బంధాన్ని రచయిత్రి కళ్లకు కట్టారు.
‘విరామమెరుగని హరిత యాజ్ఞికుడు రైతు’ అంటూ ప్రకృతి శక్తులైన పంచభూతాలు అతనికి తోడుంటాయని పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ ‘వసుధైక పోరాటం’లో హెచ్చరికలు జారీ చేశారు. మనుషుల స్వార్థం వల్ల ప్రకృతి విధ్వంసం జరుగుతోందని, భూమి తల్లి వేదన చెందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ రసాయన లీకేజీలో ప్రాణాలు కోల్పోయిన వారిని తలచుకుంటూ ‘విశోఖ కడలి’ కవితలో కన్నీరు మునిగారు.
భాషా సౌరభం - సాంస్కృతిక వైభవం
తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరిస్తూ.. నుడికారపు మణిహారం అరుదైన తెలుగురా’ అని కొనియాడారు. పుట్టిన నాటి నుండి గిట్టే వరకు మన భావాల వ్యక్తీకరణకు మాతృభాషయే శరణ్యమని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ విశిష్టతను, ఉగాది పచ్చడిలోని షడ్రుచులను కవితా రూపంలో వివరించారు. జాతీయ జెండా గొప్పతనాన్ని, మే డే సందర్భంగా కార్మిక లోకం ఏకం కావాల్సిన అవసరాన్ని కూడా నొక్కిచెప్పారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలివేయకూడదని, నువ్వు ఎంత ఎదిగినా నీ చిరునామా వారేనని ‘వెలుగుల దివిటీ’ కవితలో హితవు పలికారు.
నేడు బంధాలు కరువై వృద్ధాశ్రమాలకు పరిమితమవుతున్న తీరును తూర్పారబట్టారు. మద్యం మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. అక్షర జ్ఞానం చీకటిని పారద్రోలి వెలుగులు నింపుతుందని, గ్రంథాలయాలు అపార మేధో సదనాలని అభివర్ణించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల త్యాగాలను ‘ఓ వీర సైనికా..!’ కవితలో కొనియాడారు. వచన కవిత్వానికి సాధారణంగా కవితా సంపుటి అని పేరు ఉంటుంది.
కానీ రచయిత్రి విశ్వైక దీనికి ‘సామాజిక కవిత్వం’ అని పేరు పెట్టడం వెనుక ఆమె సామాజిక బాధ్యత కనిపిస్తుంది. సాహిత్య దారులు వేరైనా ఉద్దేశం ప్రజా ప్రయోజనకరమేనని ఆమె నిరూపించారు. ప్రతి కవితలోనూ ఒక పరిష్కారం, ఒక మార్పు, ఒక ఆశ కనిపిస్తాయి. సాహిత్య లోకంలో తన ’తొలి సంతకం’ చేస్తూ సామాజిక చైతన్యం కోసం కవయిత్రి చేసిన ప్రయత్నం ప్రశంసనీయమైంది.