‘సంక్షేమ’ విద్యార్థులకు యూనిఫామ్స్ అందేనా?
పాఠశాల విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభం రోజే స్కూల్ యూనిఫామ్స్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కానీ హైదరాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సంబంధించిన క్లాత్‌మెటీరియల్ ఇంకా రాలేదు. కేవలం ఎస్టీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మాత్రమే సగం క్లాత్‌మెటీరియల్ వచ్చినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (విజయక్రాంతి):
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జూన్ 12 కల్లా యూనిఫామ్స్ అందించ డాన్ని సవాలుగా తీసుకున్న అధికారులు.. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల యూనిఫామ్స్ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభానికల్లా యూనిఫామ్స్ అందుతాయా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు యూనిఫామ్స్ కోసం ఇవ్వాల్సిన క్లాత్‌మెటీరియల్ ఇంకా రాకపోవడం ఆయా సంక్షేమ శాఖల అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. సంక్షేమ హాస్టల్ విద్యార్థుల విషయంలో సీఎం ఆదేశాలు పనిచేయవా? అని పలువురు చర్చించుకుం టున్నారు.
క్లాత్ మెటీరియల్ కోసం నిరీక్షణ
హైదరాబాద్ జిల్లాలోని 12 ఎస్సీ సంక్షే మ హాస్టళ్లు ఉన్నాయి. ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు 4 ఉండగా 549 మంది విద్యార్థులు, 10 బీసీ సంక్షేమ హాస్టళ్లలో 523 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ సంవత్సరం అడ్మిషన్లు ఇంకా జరగాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతి పొంది చదువుకునే విద్యార్థులకు ప్రతీ సంవత్సరం నాలుగు జతల యూనిఫామ్స్‌ను ప్రభుత్వం ఆయా శాఖల ద్వారా అందిస్తోంది. అయితే, 2024 విద్యాసంవత్సరానికి విద్యార్థుల యూనిఫామ్స్‌కు సంబంధించిన క్లాత్ మెటీరియల్ ఇంకా రాలేదు.
దీంతో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కోసం క్లాత్‌మెటీరియల్ ఎప్పుడొస్తుందా? అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పాఠశాలల పునః ప్రారం భానికి మరో ఐదు రోజులే ఉన్నందున సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అందించాల్సిన యూనిఫామ్స్ విషయంలో కలెక్టర్ చొరవ తీసుకోవాలని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. క్లాత్ మెటీరియల్‌ను వెంటనే పంపిణీ చేసి విద్యాసంవ త్సరం ప్రారంభం నాటికి యూనిఫామ్స్ అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






