4 September, 2026 | 6:13 AM

మల్కాజిగిరిపై కేసీఆర్ రివ్యూ

07-06-2024 | 02:41am

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘోర ఓటమికి కారణాలపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నా మల్కాజిగిరి స్థానంలో ఎందుకు ఓడిపోయామని ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డితో గురువారం రివ్యూ నిర్వహించారు. పార్టీ చరిత్రలో ఇలాంటి ఓటమి చూడలేదని, ఎమ్మెల్యేలంతా చాలెంజ్‌గా తీసుకుంటే విజయం తీరాలకు చేరే వారమని కేసీఆర్ పేర్కొనట్టు తెలిసింది.

కార్యకర్తలు గత పదేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించలేకపోయారని, నాయకులు పార్టీ మారడం కూడా ప్రజలపై ప్రభావం పడిందని ఎమ్మెల్యేలు తెలిపినట్టు సమాచారం. కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు కావడంతో బీఆర్‌ఎస్‌ను గెలిపించినా అధికారం చేపట్టదని, మోదీ మళ్లీ అధికారం చేపడుతారనే ప్రచారంతో జనం అటువైపు మొగ్గు చూపారని అధినేతకు వివరించినట్టు తెలిసింది.