మహిళలు స్వయంకృషితో ఆర్థిక స్వాలంబన సాధించాలి
ముకరంపుర, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): సక్సెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ సొల్యూషన్స్ బ్యూటీ(Success Institute Of Beauty Solutions) అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్టిఫికేషన్ ప్రదానోత్సవ కార్యక్రమం కరీంనగర్ నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్లుగా స్వప్న సిబ్స్ ఇనిస్టిట్యూట్ ద్వారా దాదాపు 2,500 మందికి పైగా మహిళలకు బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ ఇచ్చి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి స్వయం ఉపాధి పొందేలా తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. మహిళలు తాము ఎంచుకున్న వృత్తిపై నమ్మకంతో, ధైర్యంతో ముందుకెళ్లినప్పుడే ఆశించిన విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఏ రంగంలోనైనా రాత్రికి రాత్రే లేదా కొద్ది నెలల్లోనే గొప్ప విజయాలురావని నిరంతర శ్రమ, ఓర్పు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం నేర్చుకునే తత్వం ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్స్ నిర్వాహకురాలు స్వప్న రావు, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, డాక్టర్ పద్మజ, సిబ్స్ ప్రతినిధులు, సభ్యులు, మరియు పెద్ద సంఖ్యలో శిక్షణ పొందిన మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు.