నిర్ణయాత్మక శక్తిగా మహిళ ఎదగాలి
కలెక్టర్ కె.హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): నిర్ణయాత్మక శక్తిగా మహిళలు ఎదిగినప్పుడే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కే.హరిత పునరుద్ఘాటిం చారు. జిల్లా కేంద్రాల్లోని వాసవి ఆలయంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు ఉదయ బాబు అధ్యక్షతన నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళ సాధికారిత సాధ్యం కావాలంటే స్వతహాగా నిర్ణ యాలు తీసుకుని స్థానానికి వెళ్లాలన్నారు. చదువు, అధికారం రెండు కళ్ళలాంటి అంశా లు ఇటువంటి దానిని సుసాధ్యం చేస్తాయని తెలిపారు. ప్రతి మహిళ చదువుకొని తన కాళ్ళ మీద తాను నిలబడాలన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యం సాధ్యమవుతుందన్నారు.ప్రణాళిక తో మహిళలు ముందుకు సాగాలన్నారు.
గతంతో పోలిస్తే రాజకీయ రంగాల్లో మహిళలు కొంత రాణిస్తున్నారని మరింత రాణించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సహాయాలను పూర్తిగా సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని చూపించారు. జిల్లాలో మహిళల ఆర్థిక అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నేటికీ మహిళల ఆలోచన తీరు పూర్తిగా మారడం లేదని అలా మారి ఆర్థికంగా బలోపేతం జరిగినప్పుడే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం క్లబ్ సభ్యులు జిల్లా కలెక్టర్ కె.హరిత , ఎమ్మెల్యే కోవలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఇరుకుల మంగ, ఎస్ టి ఓ కరుణశ్రీ మహిళా సంఘం సభ్యురాలు స్వరూపలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి బాల శ్రీనివాస్, కోశాధికారి కలకుంట్ల శ్రీధర్,క్లబ్ అంతర్జాతీయ ఉపాధక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్ చిలువేరు వెంకటేశ్వర్లు, గంధం శ్రీనివాస్, పట్టణంలోని మహిళలు పాల్గొన్నారు.




