11 March, 2026 | 6:53 PM

మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం

11-03-2026 01:23 AM

కలెక్టర్ కుమార్ దీపక్ 

నస్పూర్, మార్చి 10: మహిళల సంక్షేమ, అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా షెడ్యూల్ కలముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పౌర సంబంధాల అధికారి కృష్ణమూర్తి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్ పర్సన్ అంజలి, వైస్ చైర్ పర్సన్ రాజేశ్వరి లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్, పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు ఇందిరా శక్తి క్యాంటీన్లు, పెరటి కోళ్ల పెంపకం, ఇతర అనేక వ్యాపారాలలో ప్రోత్సహిస్తూ మహిళలను ముందంజలో ఉంచే విధంగా కృషి చేస్తుందన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులలో స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వామ్యులను చేస్తూ చర్యలు తీసుకోవడం జరిగిందని, తద్వారా జిల్లాలో 3 శాతం విద్యార్థుల సంఖ్య పెరిగిందని, రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాముందంజలో ఉందని తెలిపారు. పిల్లలు పుట్టినప్పటి నుండి పెరిగే వరకు కుటుంబంలో మహిళల పాత్ర కీలకమైనదని తెలిపారు.

ఐ కె పి, మెప్మా ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని, ఆరోగ్య మహిళ పథకం ద్వారా మహిళలలో నెలకొన్న దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ దిశగా పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించడం జరుగుతుందని, తాత్కాలిక ఉపశమనం కాకుండా పూర్తి  స్థాయిలో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 15 సంవత్సరాల వయసు కలిగిన బాలికలకు ప్రభుత్వం హెచ్ పి వి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తుందని, భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మహిళ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.