29 July, 2026 | 8:44 PM

విధుల్లో ఉండగానే కార్మికుడి మృత్యువాత...

29-07-2026 08:02 PM

భద్రతా ప్రమాణాలపై తలెత్తుతున్న ప్రశ్నలు – అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఉప్పల్,(విజయక్రాంతి): చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని సుదర్శన్ ఇండస్ట్రీస్‌లో బుధవారం  జరిగిన ఘోర ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. విధులు నిర్వహిస్తున్న సమయంలో లేజర్ కటింగ్ మిషన్‌లో పడి తీవ్ర గాయాలపాలైన కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం, కృష్ణా జిల్లాకు చెందిన  సురేష్  బాబు(37) సుదర్శన్  పరిశ్రమలో కొంతకాలంగా సీఎన్‌సీ లేజర్ కటింగ్ మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సాధారణంగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ యంత్రంలో చిక్కుకోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదాన్ని గుర్తించిన సహచరులు వెంటనే స్పందించినప్పటికీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టిన పోలీసులు పరిశ్రమలో భద్రతా నిబంధనలు సక్రమంగా అమలయ్యాయా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పరిశ్రమల్లో కార్మికుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ప్రమాదకర యంత్రాల వద్ద పనిచేసే కార్మికులకు తగిన రక్షణ పరికరాలు, భద్రతా శిక్షణ అందించడంలో యాజమాన్యాలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.