15 May, 2026 | 2:53 AM

ఘనంగా ప్రపంచ ఉప్పు అవగాహన వారం

15-05-2026 12:11 AM

సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహణ

హైదరాబాద్, మే 14(విజయక్రాంతి): చెన్నైకి చెందిన సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ బుధవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘ప్రపంచ ఉప్పు అవగాహన వారం 2026’ వేడుకలను జరుపుకుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం చెన్నైలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) ప్రధాన కార్యాలయం లో జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండీ, సీఈ అజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఇంగ్లీష్, హిందీ, తమిళం భాషల్లో రూపొందించిన ‘ఉప్పు తగ్గింపు మార్గదర్శక పుస్తకాలను’ ఆవిష్కరించారు. ఈ ఉప్పు తగ్గింపు మార్గదర్శిని ఆధారంగా రూపొందించిన ఒక అవగాహన వీడియోను కూడా విడుదల చేశారు. భారతీయులు సగటున వినియోగించే ఉప్పు పరిమాణాన్ని,అలాగే వంట చేసేటప్పుడు, షాపింగ్ చేసేటప్పుడు, రెస్టారెంట్లలో తినేటప్పుడు ఉప్పును ఎలా తగ్గించాలో ఈ సరళమైన గైడ్ వివరిస్తుంది. 

సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజన్ రవిచంద్రన్, ఐవోబీ సిబ్బందికి ప్రెజెంటేషన్ ఇస్తూ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఉప్పును 30% తగ్గించాలనే లక్ష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంకా సాధించలేదని ఆయన పేర్కొన్నారు. దాదాపు 92 దేశాలు ఏదో ఒక రూపంలో చట్టాలను అమలు చేస్తూ, ఈ తగ్గింపు లక్ష్యం వైపు పని చేస్తున్నాయని చెప్పారు.

భారతదేశం కూడా ఆహార పదార్థాలపై సోడియం పరిమాణాన్ని తప్పనిసరిగా ముద్రించేలా చట్టాన్ని తీసుకురావడానికి, పెద్ద ఎత్తున ఆహారాన్ని సేకరించే ప్రాంతాల్లో ఉప్పును తగ్గించడానికి ఇదే సరైన సమయమని ఆయన అన్నారు. వంటల కోసం తక్కువ సోడియం ఉన్న ఉప్పు ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని డాక్టర్ రాజ న్ రవిచంద్రన్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.