03-02-2026 12:21:31 AM
సంస్థాన్ నారాయణపూర్, ఫిబ్రవరి 2 : యువత మద్యానికి బానిసగా మారి తమ జీవితాన్ని కుటుంబాలను నాశనం చేసుకోవద్దని యోగ ఆధ్యాత్మిక భావన ద్వారా సన్మార్గంలో పయనించవచ్చని సంస్థాన్ నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అన్నారు. సోమవారం సర్వేజన సుఖినోభవంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువత మద్యానికి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన పల్లెటూర్లలో డ్రగ్స్ కోరల్లో చిక్కుకొని యువత తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారని, కన్నవారి కలలను సమాధి చేస్తూ సమాజంలో అసాంఘిక శక్తులుగా మరి నేరాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.యోగ ఆధ్యాత్మిక భావనతో సమాజంలో మంచి పౌరులుగా మెలిగే అవకాశం ఉందని తెలిపారు.ప్రతిఒక్కరి జీవితంలో యోగ ఒక భాగంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దేశిడి నరేందర్ రెడ్డి,ప్రభావతి, కొన్రెడ్డి నరసింహ, పతంజలి యోగ సమితి జిల్లా అధ్యక్షులు పాలకూర్ల పాండు గౌడ్, వార్డ్ మెంబర్లు శివ, వనజ, రమ్య శంకర్,యోగ శిక్షకులు సైదులు, విద్యార్థులు పాల్గొన్నారు.