భయాందోళనకు గురవుతున్న పరిసర గ్రామ ప్రజలు

06-10-2026 | 10:54pm

కుభీర్, అక్టోబర్ 6: నిర్మల్ జిల్లా(Nirmal District) కుభీర్ మండలంలోని పల్సి గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన థౌటి రాములు తన వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం జంతువు అడుగుల గుర్తులను గుర్తించారు. అనుమానం రావడంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారి శివప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వ్యవసాయ క్షేత్రంలో కనిపించిన అడుగుల గుర్తులను పరిశీలించారు. వాటి ఆకారం, పరిమాణం తదితర లక్షణాలను పరిశీలించిన అనంతరం అవి చిరుత పులి అడుగుల గుర్తులేనని నిర్ధారించారు.

చిరుత పులి సంచారం విషయం తెలియడంతో పల్సి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులు, ప్రజలు అప్రమత్తమయ్యారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.

చిరుత పులి కదలికలను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. గ్రామ పరిసరాల్లో అనుమానాస్పదంగా జంతువు కనిపించినా, అడుగుల గుర్తులు లేదా ఇతర ఆనవాళ్లు కనిపించినా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఒంటరిగా పంట క్షేత్రాలకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా  సూర్యావంశీ భోజరాం పటేల్, శివారు రైతులు ఉన్నారు.

మరిన్ని వార్తలు