కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ గర్జన
సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను భర్తరాఫ్ చేయాలని డిమాండ్
నిజామాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార శైలిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రోడ్డు ఎక్కింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(Chief Election Commissioner Gyanesh Kumar) రాజీనామా చేయాలని, ఆయనను తక్షణమే పదవి నుంచి భర్త చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాదులో ఆందోళన ఇచ్చే పట్టారు.
టీపీసీసీ పిలుపుమేరకు డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, జిల్లా నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితా నుంచి ఓట్లను గల్లంతు చేయడంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది లాంటిదని, అర్హులైన పౌరుల ఓట్లు తొలగిస్తే వారు ఎన్నికల్లో తమ హక్కును వినియోగించుకునే అవకాశం కోల్పోతారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న ప్రక్రియలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి పార్టీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పెద్దలు ఆరోపించారు. బిజెపికి తొత్తుగా మారిన ఎన్నికల కమిషనర్ మాకొద్దు అంటూ నినదించారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లను ఎలాంటి కారణాలతో తొలగించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలని ఎతువు పలికారు. గాంధీచౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిఇసిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.