నిబంధనలకు తూట్లు
- ఫైర్ అనుమతి తీసుకోని చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం
- 15 రోజుల్లో విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు
ఆర్మూర్, అక్టోబర్ 06 (విజయక్రాంతి): రాజు తలచుకుంటే దెబ్బలకు కొడవా.... ఉన్నోడికి ఒక లెక్క లెనోడికి మరో లెక్క అన్న చందంగా మారింది ఆర్మూర్ లోని వివిధ శాఖల అధికారుల తీరు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభిస్తున్నప్పటికి, సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారం చెసుకునే బడా బాబులకు ఒక లెక్క... సాధారణ వ్యాపారికి మరో లెక్కగా మారింది. వివరాల్లోకి వెళితే...
ఆర్మూర్ పట్టణ నడిబొడ్డున అనుమతి లేకుండానే చెన్నై షాపింగ్ మాల్(Chennai Shopping Mall) బుధవారం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి మున్సిపల్, ఫైర్, పోలీస్ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఇందులో ప్రధానమైన ఫైర్ శాఖ అనుమతి తీసుకోకుండానే ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు.
షాపింగ్ మాల్ లో అనుకోని ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాద్యులు. ఫైర్ శాఖ అనుమతి లేకుండానే ప్రారంభిస్తున్న చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యానిదా. లేక అనుమతులేకున్నా చూసి చూడనట్టు వ్యవరిస్తున్న ఫైర్ శాఖ అధికారులదా. దీనికి తోడు బస్టాండ్ ఎదురుగా షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ కు తీవ్రంగా అంతరాయం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రారంభోత్సవానికి ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖిని, ఇతర సెలబ్రిట్లను ఆహ్వానిస్తున్నారు. వీరిని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చే అవకాశం ఉంది.
ఇందుకోసం నిర్వాహకులు ఎలాంటి భద్రతపరమైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. పైపెచ్చు పోలీసుల అనుమతి తీసుకున్నప్పటికీ జనాలను నియంత్రించడానికి సరైన ఏర్పాట్లు చేయడం లేదు. జన సందోహం ఎక్కువగా ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండు ఎదురుగానే ఉండడంతో బస్సుల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. బస్సులు లోపలికి వెళ్ళే దారిలోనే ఉండటంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం మెండుగా ఉన్నాయి. దీని కోసం బస్సులను డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి నెలకొననుంది.
15 రోజుల్లో విద్యుత్ కనెక్షన్ ఎలా...!?
ఒక ఇంటికి లేదా త్రీ పేజ్ కనెక్షన్ డి.టి.ఆర్. విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడానికి నెలల తరబడి తిప్పుకునే విద్యుత్ శాఖ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. సామాన్యుడికి చెప్పులు అరిగేలా తిప్పుకునే అధికారులు చెన్నై షాపింగ్ మాల్ కు చకచక అనుమతులు ఇవ్వడం వెనక మతలబు ఏంటని పట్టణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. పెద్ద మొత్తంలోనే డబ్బులు చేతులు మారాయాన్నే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు కనెక్షన్ కోసం వినియోగదారులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు.
నెలల కింద దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్లను ఇవ్వకుండానే 15 రోజుల క్రితం అనుమతి కోసం దరఖాస్తు చెలుకున్న చెన్నై షాపింగ్ మాల్ కు ఎలా విద్యుత్ కనెక్షన్ ఇచ్చారనేది చర్చనీయంగా మారింది. ఆర్మూర్ లోని రెండు ప్రైవేటు ఆసుపత్రులవారు నూతన భవనాలు నిర్మించుకున్నారు. వాటికి డిటిఆర్ త్రీ ఫేస్ ఏర్పాటు చేయాలని దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. రాజారాం నగర్ గేటు ఎదురుగా ఉన్న ఎస్.బి.ఐ. బ్యాంకు కార్యాలయాన్ని వెనుక భాగంలో ఉన్న మరో బిల్డింగ్ లోకి మారుస్తున్నారు.
ఇందుకోసం త్రీ ఫేస్ డి టి ఆర్ ఇవ్వాలని కొన్ని నెలల కిందనే దరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటివరకు మంజూరు చేయలేదు. అలాగే మహాలక్ష్మి మందిరం రోడ్డులో ఉన్న మరో ఎస్.బి.ఐ. బ్యాంకుకు సైతం త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేయాలని దరఖాస్తు పెట్టుకున్న వీరికి సైతం ఇంకా అనుమతి లభించలేదు. ఇవే కాకుండా పట్టణంలో మరెన్నో కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నాయి.
ఇవే కాకుండా రాజారాం నగర్, జర్నలిస్టు కాలోనీ, మహాలక్ష్మి కాలోనీ, అంబెడ్కర్ చౌరస్తా, శ్రీరామ కాలనీ, జిరాయత్ నగర్, హుస్నాబాద్, కింది బజార్, మీది బజార్ ఇంకా ఇతర కాలనీలో లో వోల్టేజ్ సమస్య ఉన్నప్పటికీ ఇంతవరకు విద్యుత్ శాఖ అధికారులు అటువైపు చూస్తున్న చూసిన దాఖలు లేవు. కాలనీవాసులు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. లక్షల్లో జీతాలు ఉన్నప్పటికీ కాసులు కుమ్మరిస్తే ఎంత త్వరగా అనుమతులు వస్తాయో చెన్నై షాపింగ్ మాల్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చని ప్రజలు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సరైన అనుమతి లేకుండా ప్రారంభిస్తున్న షాపింగ్ మాల్ పై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం సంబంధిత శాఖ అధికారులపై ఎంతైనా ఉంది.
ఫైర్ అనుమతి తీసుకోలేదు
విక్రమ్, ఆర్మూర్ ఇంచార్జ్ ఫైర్ అధికారి
ఆర్మూర్ చెన్నై షాపింగ్ మాల్ ఫైర్ అనుమతి తీసుకోలేదు. రెండు, మూడు రోజుల క్రితమే వారికి నోటీసు ఇచ్చాము. అయినా వారు ఇప్పటివరకు ఫైర్ శాఖ అనుమతి తీసుకోలేదు. శాఖ పరమైన చర్యలు తీసుకుంటాము.