రీ సర్వే అనంతరం భూధార్ నంబర్ల కేటాయింపు

24-11-2026 | 05:25pm

భూ యజమానులు, రైతులు రీ సర్వేకు సహకరించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

బోధన్, నవంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో చేపడుతున్న భూముల రీ సర్వే(Telangana Land Resurvey) ప్రక్రియ పూర్తయిన అనంతరం భూ యజమానులకు ఆధార్ తరహాలో భూధార్ నంబర్లను కేటాయించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రీ సర్వే ద్వారా భూముల హద్దులను ఖచ్చితంగా గుర్తించడంతో పాటు భూమికి సంబంధించిన సమగ్ర వివరాలు, మ్యాప్‌ను రూపొందించి ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయిస్తామని వెల్లడించారు. మంగళవారం అనంతగిరి గ్రామంలో రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు.

భూముల రీ సర్వే వల్ల భూ హద్దులపై స్పష్టత ఏర్పడటంతో పాటు భవిష్యత్తులో భూ వివాదాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి భూమికి సంబంధించిన వివరాలు సమగ్రంగా నమోదు చేసే ఈ ప్రక్రియలో రైతులు, భూ యజమానులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. రీ సర్వే సిబ్బందికి అవసరమైన భూమి వివరాలను అందిస్తూ, క్షేత్రస్థాయిలో నిర్వహించే సర్వేకు సహకరించాలని కోరారు. భవిష్యత్తులో భూములకు సంబంధించిన లావాదేవీలు, హద్దుల గుర్తింపు, రికార్డుల నిర్వహణలో భూధార్ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ వెంకటరమణ, స్థానిక సర్పంచ్ సుమలత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు