దీపావళి వేళ రామకృష్ణాపూర్లో విషాదం
టపాసు పేలి బాలుడికి తీవ్ర గాయాలు
ముఖంపై గాయాలు.. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
ముత్తారం, నవంబర్ 09 (విజయక్రాంతి): వెలుగుల పండుగ దీపావళి వేళ ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా టపాసులు(Firecrackers) కాల్చుకుంటూ పండుగ జరుపుకోవాల్సిన సమయంలో ప్రమాదం ఆ కుటుంబాన్ని ఆందోళనలోకి నెట్టింది. మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ఇరుగుల రవీందర్ కుమారుడు సోమవారం ఇంటి వద్ద టపాసులు కాల్చుతుండగా ప్రమాదవశాత్తు బాణసంచా పేలింది(Accidental explosion of fireworks). ఈ ఘటనలో బాలుడి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడి బాలుడి వద్దకు పరుగులు తీశారు. వెంటనే బాలుడిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి(Peddapalli Government Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు.
పండుగ పూట బిడ్డకు గాయాలు కావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు బాలుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. పండుగ ఆనందం మధ్య చోటుచేసుకున్న ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.