AI సైబర్ దాడులు.. సజ్జనార్ వార్నింగ్

09-11-2026 | 06:54pm

హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు(Cybercriminals) కూడా కొత్త పంథాలో దాడులకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్విక్ కామర్స్ కంపెనీల డిజిటల్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(Hyderabad CP Sajjanar) హెచ్చరించారు. సైబర్ ముప్పులను అడ్డుకునేందుకు సంస్థలు తమ భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు.

పాత APIలతో పెరుగుతున్న ముప్పు

సంస్థలు వినియోగిస్తున్న పాత సాఫ్ట్‌వేర్లు, భద్రత లేని API సేవలు సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతున్నాయని సీపీ పేర్కొన్నారు. AI ఏజెంట్ల సాయంతో డిజిటల్ నెట్‌వర్క్‌లలోని బలహీనతలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. పేమెంట్ APIలను దుర్వినియోగం చేస్తూ మ్యూల్ బ్యాంకు ఖాతాలకు నిధులు మళ్లించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

బ్యాంకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

వినియోగంలో లేని పాత APIలను తొలగించాలని, థర్డ్ పార్టీ సేవలకు పటిష్టమైన భద్రత కల్పించాలని సజ్జనార్ సూచించారు. నగదు బదిలీ వ్యవస్థల్లో అదనపు భద్రతా తనిఖీలు ఏర్పాటు చేయాలని, అసాధారణ లావాదేవీలను గుర్తించేలా ప్రత్యేక పరిమితులు విధించాలని తెలిపారు. భారీ మొత్తాల బదిలీలకు ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి చేయాలని, నగదు బదిలీకి ముందు పూర్తిస్థాయి KYC ధ్రువీకరణ ఉండాలని స్పష్టం చేశారు.

అంతేకాకుండా సైబర్ దాడులను ముందుగానే గుర్తించేందుకు రెడ్ టీమ్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని, ఐటీ, సైబర్ సెక్యూరిటీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మోసపోతే వెంటనే 1930కు కాల్ చేయండి

సైబర్ నేరాలు జరిగిన తర్వాత ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించాలని సీపీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసానికి గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

మరిన్ని వార్తలు