అండాల విక్రయం.. పేద యువతులే టార్గెట్
09-11-2026 | 07:59pm
హైదరాబాద్: హైదరాబాద్లో మహిళల అండాల సేకరణ, విక్రయానికి సంబంధించిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగాల పేరుతో పేద యువతులను ఆకర్షించి, ఒక్కొక్కరికి రూ.30 వేల వరకు ఆశ చూపుతూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.
మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వ్యవహారంలో ఆరు రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మంది యువతులు బాధితులుగా ఉన్నారు. వారిలో దాదాపు 90 శాతం మంది అవివాహితులేనని తెలిపారు. బాధితుల ఆధార్ కార్డుల్లోనూ నిందితులు మార్పులు చేసినట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.
ఐదు ఫెర్టిలిటీ సెంటర్లపై విచారణ
ఈ వ్యవహారంలో శారద, నర్మద, ఒయాసిస్, ఏఆర్టీ, ఇందిర ఫెర్టిలిటీ సెంటర్లకు సంబంధించిన పలు అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు మహిళా కమిషన్ తెలిపింది. ఆసుపత్రుల్లో కనీస స్థాయి రికార్డులు కూడా నిర్వహించలేదనే అంశాన్ని ప్రస్తావించింది.
విచారణకు బాధ్యులైన ఛైర్మన్లు, ఎండీలకు బదులుగా కిందిస్థాయి సిబ్బందిని పంపడంపై కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 13న స్వయంగా హాజరుకావాలని సంబంధిత ఫెర్టిలిటీ సెంటర్ల బాధ్యులకు మరోసారి నోటీసులు జారీ చేసింది.
గర్భిణికి అబార్షన్ ఘటనపై ఆగ్రహం
మరోవైపు చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా రెండు నెలల గర్భిణికి అబార్షన్ జరిగిందనే ఫిర్యాదుపైనా మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనకు బాధ్యులైన ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని అన్ని ఫెర్టిలిటీ సెంటర్ల కార్యకలాపాలపై పోలీసుల నుంచి సమగ్ర నివేదిక కోరింది.
ప్రధాన నిందితుడి కోసం గాలింపు
ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హుస్సేన్ను వెంటనే గుర్తించి పట్టుకోవాలని పోలీసులకు మహిళా కమిషన్ సూచించింది. మహిళల అండాల సేకరణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలపై పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని నేరెళ్ల శారద వెల్లడించారు.