దీపావళి రోజు దొంగతనం
- సుమారు 70 లక్షలు విలువగల బంగారు ఆభరణాలు, నగదు అపహరణ
- వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ
ఎల్బీనగర్: దీపావళి పండుగ వేళా అంతటా వెలుగు నిండితే... ఒక వ్యాపారి ఇంట్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఆదివారం దీపావళి పండుగ పూజల అనంతరం సాయంత్రం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి సుమారు రూ.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును చోరీ చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో గణేశ్ టెంపుల్ నుంచి రైతు బజార్ ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న ఖాదీ బండారు షాప్ యజమాని వికాస్ ఉంటున్నాడు.
ఆదివారం ఇంట్లో దీపావళి పూజ అనంతరం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లారు. తిరిగి రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి, పడకగదిలో ఉన్న బీరువాలోని వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. వెంటనే వెళ్లి చూడగా సుమారు రూ.25 లక్షల నగదు, 30 తులాల బంగారం, వెండి ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు.
సుమారు రూ.70 - రూ, 80 లక్షలు విలువ మేరకు చోరీకి గురైనట్లు బాధితుడు వికాస్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ కరుణాకర్ రావు, సీఐ రవిబాబు, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ రాజేశ్ నాయక్, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ గోవిందరావు, ఎస్సెలు వాసు, రమేశ్, వెంకటేశ్, మహేశ్, కరుణ్ పరిశీలించారు. ఇంటిలోని, పరిసర ప్రాంతాల్లోని వివరాలను సేకరించారు.
పోలీసులకు సవాల్ విరిసిన దొంగలు
వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో చోరీ జరగడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. పోలీసుల నిఘాపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసంచారం ఉన్న సమయంలోనే దొంగలు చోరీకి పాల్పడటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పోలీసుల నిఘా, భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి నిందితులను గుర్తించి పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.