మత్తుకు దూరంగా ఉండాలి
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్మణ్
బీఎన్ రెడ్డి నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు
నషా ముక్త్ భారత్ – సైక్లింగ్ ర్యాలీ
ఎల్బీనగర్: ప్రతి ఒక్కరూ మత్తుకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల రహిత సమాజమే మన లక్ష్యం కావాలని, ఆరోగ్యవంతమైన యువతే దేశానికి బలం అని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్మణ్(MP Dr. Laxman) అన్నారు. అక్షర స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణం, యువతలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఆదివారం బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని సాగర్ కాంప్లెక్స్ నుంచి ఎల్బీనగర్ వరకు 'నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీ'(Nasha Mukt Bharat – Cycling Rally) నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ అసెంబ్లీ ఇన్ చార్జి సామ రంగా రెడ్డి రెడ్డి, మాజీ కార్పొరేటర్లు లచ్చిరెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సైక్లింగ్ ర్యాలీ ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, యువతకు ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యత వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత దేశ భవిష్యత్తుకు వెన్నెముక అని, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా క్రీడలు, వ్యాయామం, సామాజిక సేవ తదితర ఆరోగ్యకరమైన కార్యక్రమాల వైపు అడుగులు వేయాలన్నారు. అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ చేపట్టిన అవగాహన కార్యక్రమం యువతకు స్ఫూర్తినిస్తూ, మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణానికి దోహదపడాలని ఆకాంక్షించారు.